జూన్ నుంచి ‘కేంద్రీయ’ తరగతులు
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:26 PM
Central School in Palasa ‘పలాసలో కేంద్రీయ విద్యాలయం జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు నిర్వహించనున్నామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
పలాసలో స్థలాలు, ఆర్పీఎఫ్ బ్యారెక్స్ పరిశీలన
పలాస, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ‘పలాసలో కేంద్రీయ విద్యాలయం జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు నిర్వహించనున్నామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. పద్మనాభపురం వద్ద కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని, మ్యాప్‌ను, పలాస రైల్వేకాలనీ వద్ద తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు వినియోగించనున్న ఆర్‌పీఎఫ్ బ్యారక్స్‌ను మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘పలాసలోని కేంద్రీయ విద్యాలయంలో జూన్ నుంచి తరగతులు ప్రారంభించాలని అధికారులను కోరాం. 15 రోజుల్లో ఆర్పీఎఫ్ బ్యారెక్స్ ఖాళీ చేసి కేంద్రీయ విద్యాలయానికి అందిస్తారు. ఈ ప్రాంతవాసులకు కేంద్రీయ విద్యాలయం ఎంతో వినియోగపడుతుంది. నా తండ్రి ఎర్రన్నాయుడు హయాంలో శ్రీకాకుళంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కాగా.. ప్రస్తుతం పలాసలో కూడా విద్యాలయం ఏర్పాటు కావడం ఆనందంగా ఉంద’ని తెలిపారు.
జీడి, కొబ్బరి అభివృద్ధికి చర్యలు
‘ఉద్దానంలో జీడి, కొబ్బరి అనుబంధ పరిశ్రమలు, రైతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శిశివరాజ్‌సింగ్‌చౌహాన్‌తో ఇప్పటికే ఉద్దానం గురించి చర్చించాం. కొబ్బరి, జీడికి బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా నిధులు తెచ్చేలా కృషి చేస్తాం. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్క కొబ్బరిపైనే 150 రకాల ఉత్పత్తులు తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తాం. గోవా రాష్ట్రం మాదిరి జీడి ఆధారిత పరిశ్రమలు కూడా నెలకొల్పేలా వ్యాపారులకు సహకారం అందిస్తాం. మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో జిల్లాలో వ్యవసాయాభివృద్ధి చేస్తామ’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
ఎయిర్‌పోర్టుకు సహకరించాలి
పలాసలో నిర్మించతలపెట్టనున్న కార్గో ఎయిర్‌పోర్టుకు ప్రజలు సహకరించాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కోరారు. గ్రామస్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పలాస టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదిరి, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావుయాదవ్, పీరుకట్ల విఠల్‌రావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, గాలి కృష్ణారావు, టంకాల రవిశంకర్‌గుప్తా, ఎం.నరేంద్ర, సప్ప నవీన్, జోగ మల్లి, కొత్త సత్యం. ఎ.రామకృష్ణ, కొరికాన శంకర్, ఆర్డీవో జి.వెంకటేష్, తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి పాల్గొన్నారు.