Share News

14 గ్రామాలకు వేడుక

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:03 AM

Sri Ramanavami pujas in Talathampara ఆచార, సంప్రదాయాలకు నిలయంగా.. శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు కంచిలి మండలం తలతంపర గ్రామం ముస్తాబైంది. తలతంపరతోపాటు పరిసర 14 గ్రామాల సహకారంతో ఏటా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

14 గ్రామాలకు వేడుక
తలతంపరలో సీతారాముల విగ్రహాలు

తలతంపరలో శ్రీరామనవమి పూజలు ‘ప్రత్యేకం’

37 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం

నేటి నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు

కంచిలి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఆచార, సంప్రదాయాలకు నిలయంగా.. శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు కంచిలి మండలం తలతంపర గ్రామం ముస్తాబైంది. తలతంపరతోపాటు పరిసర 14 గ్రామాల సహకారంతో ఏటా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. పూర్వీకుల ఆచారాలను పాటిస్తూ.. 37 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఉత్సవాల నిర్వహణకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

తలతంపరతోపాటు కాళింగపుట్టుగ, కొన్నాయిపుట్టుగ, సూదిపుట్టుగ, మజ్జిపుట్టుగ, కాకర్లపుట్టుగ, లండపుట్టుగ, చిల్లొపుట్టుగ, ఒరియా నారాయణపురం, ప్రధానపుట్టుగ, దొళాయిపుట్టుగ, కొక్కిలిపుట్టుగ, నాథపుట్టుగ, ఆముదాలపుట్టుగ గ్రామాల ప్రజలంతా కలిసి వేడుకలను నిర్వహిస్తారు. శ్రీరామ నవమి పూజా కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి సమష్టి సహకారంతో శ్రీరామ పట్టాభిషేకం, సీతారాముల కల్యాణం వేడుకలను పండుగలా నిర్వహిస్తుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వేడుకలను తిలకించేందుకు పరిసర గ్రామస్థులతోపాటు.. సుదూర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వలస కూలీలు ఎక్కడ ఉన్నా.. ఈ వేడుకలకు తప్పనిసరిగా వస్తుంటారు. వలస కూలీలతోపాటు బయట ప్రాంతాల్లో బాగా స్థిరపడినవారు అధికంగా విరాళాలు ఇస్తూ వేడుకల్లో భాగస్వామ్యం అవుతారు. ఈసారి సుమారు రూ.7లక్షల వ్యయంతో వేడుకలను నిర్వహించనున్నట్టు పూజా కమిటీ అధ్యక్షుడు మర్రిపాటి పూర్ణచంద్రుడు, సంతోష్‌ రౌళో తెలిపారు.

ప్రత్యేక ఆకర్షణగా విగ్రహాలు

శ్రీరామనవమి వేడుకల్లో దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఏటా విభిన్న రూపాల్లో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు విగ్రహాలను రూపొందిస్తారు. పూర్వీకుల ఆచారం ప్రకారం.. ఒడిశాలోని కటక్‌కు చెందినవారితో ఈ విగ్రహాలను తయారు చేయిస్తుంటారు. గతంలో కొమ్ముదో అనే కళాకారుడు కొంత మంది శిష్యులతో ఇక్కడికి వచ్చి సుమారు నెలరోజులపాటు విగ్రహాలను ఆకర్షణీయంగా తయారుచేసేవారు. ప్రస్తుతం కటక్‌కి చెందిన గోవిందో తన బృంద సభ్యులతో విగ్రహాలను తయారు చేశారు. ప్రధాన విగ్రహాలతోపాటు గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఐదు మండపాలను(పెండాళ్‌) ఏర్పాటు చేసి.. అందులో వివిధ దేవతామూర్తులను తీర్చిదిద్దారు.

Updated Date - Mar 27 , 2026 | 12:03 AM