జాగ్రత్తలే పంటలకు రక్ష
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:03 AM
జిల్లాలో ఈఏడాది వరి 3.69లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు.
-వర్షాలకు దెబ్బతినకుండా రైతులు కాపాడుకోవాలి
- వ్యవసాయ శాస్త్రవేత్తల పలు సూచనలు
నరసన్నపేట, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈఏడాది వరి 3.69లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట కొన్నిచోట్ల పూతదశ, గింజపట్టే దశ, మరికొన్ని చోట్ల కోత దశలో ఉంది. అలాగే, మొక్కజొన్న 25వేల ఎకరాల్లో సాగులో ఉంది. ప్రస్తుతం ఆర్నాబ్ తుఫాన్‌తో వర్షాలు కురుస్తుండడంతో ఈ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే, తగిన జాగ్రత్తలు పాటిస్తే పంటలను కొంతవరకు కాపాడుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు పలు సూచనలు చేస్తున్నారు.
వరిలో పరిస్థితి..
ప్రస్తుతం వరిలో ఎంటీయూ 1061, 1318, స్వర్ణ, సంపద స్వర్ణ, బీపీటీ 5204 మొదలైన రకాలు పూతదశలో ఉన్నాయి. ఈ దశలో వర్షాలు కురిసిస్తే తాలు (కవ్వ) గింజలు ఏర్పడతాయి. అదేవిధంగా ఎంటీయూ 1318, ఎంటీయూ 1262, ఎంటీయూ 1124 వంటి రకాల్లో గొలుసుకట్టు దగ్గరగా ఉండటంతో గింజ రంగు మారడంతో పాటు మానిపండు తెగులు వచ్చే అవకాశం ఉంది.కొన్నిసార్లు మొలకలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎండాకు తెగులు, మాగుడు తెగులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. బీపీటీ 5204, పీఎల్‌ఏ 1100 వంటి నిద్రావస్థలేని రకాల్లో గింజలు వెంటనే మొలకెత్తే అవకాశం ఉంది.
రక్షణ చర్యలు..
- పాలు పోసుకునే దశలో ఉన్న స్వర్ణ, సంపద స్వర్ణ, బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్, కేఎన్‌ఎం 1638 రకాలు వర్షాలు, ఈదురు గాలులకు నేలవాలితే పొలంలోని నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. ఎక్కువగా నీరు నిలిచిన చోట మోటార్ల ద్వారా తొలగించాలి. గింజలు రంగు మారకుండా ఉండేందుకు, మాగుడు, మానిపండు తెగుళ్లు రాకుండా ఎకరాకు 200 మి.లీ ప్రొపికోనాజోల్‌ను నీటితో కలిపి పిచికారి చేయాలి.
- గింజ గట్టిపడే దశలో ఉన్న పంట అధిక వర్షాలకు గురైతే పొలంలోని నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. కంకిలో మొలకలు కనబడితే 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల స్పటిక ఉప్పుని లీటరు నీటిలో కలిపి) పిచికారి చేయాలి. ఇది మొలకలను, గింజ రంగు మార్పును తగ్గిస్తుంది.
- కోత సమయంలో చేను పడిపోతే వెంటనే పొలంలో నీరు లేకుండా చేయాలి. గింజలు మొలకెత్తకుండా 5శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారి చేయాలి. సాంబమసూరి వంటి రకాలు నీటిలో మునిగితే వెంటనే మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి, చేనుకు సమతుల్యంగా ఉండేందుకు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఎరువులను వేయాల్సి ఉంది.
మొక్కజొన్నలో ..
- వర్షాలు తగ్గిన వెంటనే మొక్కజొన్న కండెలను కోత చేపట్టాలి. తడిసిన కండెలను గచ్చుపై పలుచగా పేర్చి ఎండలో బాగా అరబెట్టి సాధ్యమైనంత త్వరగా నూర్పిడి చేయాలి. కోత దశలో ఉన్న పంట నేలకు ఒరిగితే పొలంలోని నీటిని బయటకు తీసివేసి చేనుపై ప్రొపికోనజోల్ 1 మి.లీ లేదా హెక్కాకొనజోల్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. కోత తరువాత కళ్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న కండెలు తడిస్తే వాటిని నీడలో ఆరబెట్టాలి. అవసరాన్ని బట్టి కండెలపై పలుచగా 5శాతం మెత్తటి ఉప్పును చల్లాలి. అనంతరం కింద మీద బాగా కలపడం వల్ల మొలకలు రాకుండా చాలా వరకు నివారించవచ్చు.