Share News

పిక్క రాలుతోంది

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:05 AM

Diminishing hopes for cashews ఉద్దాన ప్రాంత రైతులకు ప్రధాన ఆధారమైన జీడి పంట నిరాశపరుస్తోంది. ప్రకృతి వైరుధ్యం.. వారికి శాపంగా మారింది. పూతదశ వరకు బాగానే ఉన్నా, పిక్కలు తొలిదశలోనే ఎండిపోయి రాలిపోతున్నాయి.

పిక్క రాలుతోంది
చెట్టుపై మాడిపోతున్న పూత

- జీడి దిగుబడిపై తగ్గుతున్న ఆశలు

- పిండినల్లి, బూజుతో పంటకు నష్టం

- ఆందోళన చెందుతున్న ఉద్దానం రైతులు

వజ్రపుకొత్తూరు/పలాస రూరల్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఉద్దాన ప్రాంత రైతులకు ప్రధాన ఆధారమైన జీడి పంట నిరాశపరుస్తోంది. ప్రకృతి వైరుధ్యం.. వారికి శాపంగా మారింది. పూతదశ వరకు బాగానే ఉన్నా, పిక్కలు తొలిదశలోనే ఎండిపోయి రాలిపోతున్నాయి. దీంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది దిగుబడితో పాటు ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు కొంతమేర అప్పుల నుంచి గట్టెక్కారు. ఈ ఏడాది అందుకు విరుద్ధంగా ఉందని వాపోతున్నారు.

పలాస నియోజకవర్గంలో సుమారు 3,500 హెక్టార్లలో జీడి సాగు చేస్తున్నారు. ఉద్దానం రైతులకు జీడిపంటే ప్రధాన ఆదాయ వనరు. పంట దిగుబడి బాగుంటే ఆ ఏడాది అన్ని ఖర్చులు దాటుతాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆశించిన ఆదాయం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాది దసరా నుంచి వర్షాలు సరైన వర్షాలు లేవు. ఎండ వేడి, మబ్బు వాతావరణంతో జీడి పంట ఎదుగుదలపై ప్రభావం పడింది. పూతదశకు చేరుకున్నా.. ఇటీవల పొగమంచు తీవ్రంగా ఉండడం... ఆ తరువాత ఈదురుగాలులు జీడిని దెబ్బతీశాయి. అక్కుపల్లి, బైపల్లి, చినవంక, డోకులపాడు రాజాం, గరుడభద్ర, మెట్టూరు, గుణుపల్లి పంచాయతీలలో జీడి దిగుబడి దారుణంగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ఏటా ఉగాది నాటికి జీడిపిక్కలను ఇష్టదైవాలకు ప్రసాదంగా పెట్టేవారు. ఈ ఏడాది ఇంతవరకూ పంట దిగుబడి లేదని ఆందోళన చెందుతున్నారు. పిందెలకు పిండినల్లి, బూజు (నలుపురంగు)గా తయారవడంతో పిక్క ఎదుగుదల లేదని పేర్కొంటున్నారు. గత ఏడాది ఈ సమయానికి 25 శాతం పంట చేతికి అందగా... ఈ ఏడాది 5 శాతం కూడా కనిపించడం లేదని చెబుతున్నారు. జీడిపంట సస్యరక్షణకు సలహాలు, సూచనలు ఇచ్చే అధికారులు కరువయ్యారని ఆరోపిస్తున్నారు.

దిగుబడి దారుణం

గత ఏడాది ఈ సమయానికి 25 శాతం పైబడి పంట చేతికి అందగా.. ఈ ఏడాది 5 శాతం కూడా ఇంటికి చేరలేదు. ఇలా అయితే ఈ సంవత్సరం జీడిరైతులు అప్పుల పాలయ్యే అవకాశం ఉంది.

- కోనేరు కామేశ్వరరావు, రైతు, బైపల్లి

ప్రభుత్వం ఆదుకోవాలి

ఈ ఏడాది జీడిపంటకు తెగుళ్లు ఆశించడంతో నష్టాలు తప్పేలా లేవు. ఆశించిన స్థాయిలో దిగుబడి లేక.. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పంట సస్యరక్షణకు అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వాలి.

- మామిడి భాస్కరరావు, మామిడిపల్లి, జీడిరైతు

వాతావరణ మార్పులే కారణం

పూత ఆలస్యం కావండతో పాటు వాతావరణంలో మార్పుల కారణంగా జీడి పిక్కలు తొలిదశలోనే మాడిపోతున్నాయి. రైతులు అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు పాటిస్తే నష్టాన్ని నివారించవచ్చు. అవసరమైతే ఉద్యానవన శాఖాధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. తోటల్లోకి గాలి, వెలుతురు వచ్చేవిధంగా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే మందులు పిచికారీ చేయాలి. దీని వల్ల కొంతవరకూ ఫలితం ఉంటుంది.

- శంకర్‌దాస్‌, ఉద్యానశాఖాధికారి, వజ్రపుకొత్తూరు

సూచనలు అందజేస్తున్నాం

జీడి పంట సమస్యలపై రైతులకు సూచనలు అందజేస్తున్నాం. ప్రస్తుతం జీడికి పిండినల్లి, బూజు తెగుళ్లు ఆశించాయి. చినుకులు పడుతుండడం, మబ్బు వాతావరణం వల్ల కొంత నష్టం వాటిల్లుతోంది. పిండినల్లి నివారణ వాడాల్సిన మందులను రైతులకు తెలియజేస్తున్నాం.

- సీహెచ్‌ శంకర్‌, ఉద్యానశాఖాధికారి, పలాస

Updated Date - Apr 01 , 2026 | 12:05 AM