Share News

జీడిపప్పు ః 900

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:03 AM

Rs.50 hike on a kilo of cashew nuts పలాస-కాశీబుగ్గ జీడిమార్కెట్‌లో జీడిపప్పు ధరలు ఊపందుకున్నాయి. ప్రథమశ్రేణి జీడిపప్పు ధర కిలో రూ.900 పలుకుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే అన్ని రకాల జీడిపప్పులపై కిలోకు రూ.50 పెరగడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జీడిపప్పు ః 900
పలాసలో జీడిపప్పు గ్రేడింగ్‌ చేస్తున్న మహిళా కార్మికులు

15 రోజుల వ్యవధిలోనే కిలోపై రూ.50 పెంపు

వ్యాపారుల్లో ఆనందం

పలాస మార్కెట్‌లో జోరుగా విక్రయాలు

పలాస, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జీడిమార్కెట్‌లో జీడిపప్పు ధరలు ఊపందుకున్నాయి. ప్రథమశ్రేణి జీడిపప్పు ధర కిలో రూ.900 పలుకుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే అన్ని రకాల జీడిపప్పులపై కిలోకు రూ.50 పెరగడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశీయంగా లభిస్తున్న జీడి పిక్కల ధరలు యథాస్థితిలో కొనసాగుతున్నాయి. కానీ విదేశీ జీడిపిక్కలు.. ముఖ్యంగా టాంజేనియా దేశానికి చెందినవి అమాంతంగా ధర పెరిగాయి. ప్రస్తుతం జీడి ప్రాసెసింగ్‌లో వ్యాపారులు బిజీగా ఉన్నారు. దేశవిదేశాల నుంచి ఆర్డర్లు వస్తుండడంతో జీడిపప్పు తయారీలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోనే పలాస జీడిపప్పు ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం జీడిపప్పు ఎగుమతి, దిగుమతికి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు జీడి హబ్‌ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీంతోపాటు జీడి ఎగుమతి, దిగుమతిపై ఉన్న సుంకాలు సైతం ఎత్తివేసి సులభతరమైన మార్కెట్‌కు అవకాశం కల్పించారు. ఈక్రమంలో 15 రోజుల్లోనే కిలో జీడిపప్పుపై రూ.50 పెరగడంతో మార్కెట్‌ ఊపందుకుంది. విదేశాల నుంచి తీసుకువచ్చిన జీడిపిక్కలు ప్రస్తుతం పలాస మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. దేశీయ పిక్కలు లభ్యం కాకపోవడంతో టాంజేనియా, ఘనా, ఐవిరికోస్ట్‌, శ్రీలంక వంటి దేశాల నుంచి పిక్కలు తెప్పిస్తున్నారు.

జిల్లాలో మొత్తం 400 వరకూ జీడి పరిశ్రమలు ఉండగా ఒక్క పలాస-కాశీబుగ్గలోనే 250 పరిశ్రమల వరకూ ఉన్నాయి. మన దేశంలో మన రాష్ట్రంతో పాటు గోవా, ఒడిశా, తెలంగాణ, కేరళ, గురజాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో జీడిపంట సాగవుతోంది. మన రాష్ట్రంలో.. జిల్లాలోని పలాసలో ఎక్కువగా జీడి పరిశ్రమలు ఏర్పడ్డాయి. దేశీయంగా లభ్యమయ్యే జీడి ఉత్పత్తుల్లో పలాస మార్కెట్‌నే ఎక్కువగా వ్యాపారులు ఎంపిక చేసుకుంటారు. మార్కెట్‌ ఒడిదొడుకులు కారణంగా ప్రస్తుతం ఒడిశాలో ఎక్కువగా జీడి పరిశ్రమలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్కెట్‌ కాస్త అటువైపు వెళ్లడంతో ఏడాదిగా పలాస మార్కెట్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సమయంలో జీడిపప్పు ధర పెరిగి.. మంచి మార్కెట్‌ లభిస్తుండడంతో వ్యాపారుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. ప్యాకింగ్‌లు ఆర్డర్లతో వ్యాపారులు బిజీగా ఉన్నారు. అలాగే జీడి పిక్కలకు గిట్టుబాటు కల్పించాని డిమాండ్‌ చేస్తున్న రైతులకు పెరిగిన ధర.. స్వల్ప ఊరటనిస్తోంది. అయితే వారు 80 కిలోల బస్తా రూ.16వేలు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. టాంజేనియా పిక్కలతో పోటీ పడితే రైతులు ఆశిస్తున్న ధరకు చేరుకునే అవకాశం ఉంది.

పలాస మార్కెట్‌లో ప్రస్తుత జీడిపప్పు ధరలు:

----------------------------

రకం(కిలో) ధర(రూ.లో)

----------------------------

జెంబో - 900

180(కౌంట్‌) - 850

240(కౌంట్‌) - 820

బద్ద(పెద్దది) - 810

బద్ద - 740

కె(మార్కు) - 700

పీసెస్‌ - 600

----------------------------

జీడి పిక్కలు ధరలు (80 కిలోల బస్తా)

-----------------------

టాంజేనియా పిక్కలు - రూ.15,200

దేశీయంగా లభించే పిక్కలు - రూ.14,000

Updated Date - Feb 13 , 2026 | 12:03 AM