Share News

జీడి పిక్కల ధరలు ఢమాల్‌

ABN , Publish Date - May 13 , 2026 | 11:32 PM

ఉద్దాన ప్రాంత రైతులకు ప్రధాన జీవనాధారమైన జీడి పిక్కల ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    జీడి పిక్కల ధరలు ఢమాల్‌

- 20 రోజుల వ్యవధిలో బస్తాపై రూ.1500 పతనం

- గగ్గోలు పెడుతున్న రైతులు

- ఎగుమతులు తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు

వజ్రపుకొత్తూరు, మే 13 ( ఆంధ్రజ్యోతి): ఉద్దాన ప్రాంత రైతులకు ప్రధాన జీవనాధారమైన జీడి పిక్కల ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌ నెల చివరి వారంలో 80 కిలోల పిక్కల బస్తా ధర రూ.13,500 ఉండగా, ప్రస్తుతం రూ.12వేల నుంచి 12,500 పలుకుతోంది. బస్తాపై ఒకేసారి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి గత ఏడాదితో పోల్చితే జీడి పిక్కలు దిగుబడి ఈ ఏడాది తగ్గింది. దీంతో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆశించారు. కానీ, గత సంవత్సరం కంటే ధర తక్కువ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి..

పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లో ఏడాదికి లక్ష బస్తాల పిక్కలను రైతులు పండిస్తుంటారు. వీటిని పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న వ్యాపారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జీడిపరిశ్రమ యజమానులే కొనుగోలు చేస్తుంటారు. అయితే పెద్ద వ్యాపారులు ఉద్దాన ప్రాంతాల్లో పండించే పిక్కల కంటే ఇతర ప్రాంతాలు, విదేశీ పిక్కలను కొనేందుకు మొగ్గు చూపుతుండడంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విదేశీ పిక్కల దిగుమతిపై ఆంక్షలు విధించినట్లయితే ఉద్దానం పిక్కలకు మంచి ధర పలికి గిట్టుబాటు లభిస్తుందని రైతులు అంటున్నారు. బస్తా పిక్కలను రూ.16 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా వ్యాపారులు మాత్రం రూ.12,500 మాత్రమే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. ఇదే ధరలు చివరు వరకు కొనసాగితే పెట్టుబడి సొమ్ముకూడా కూడా రాదని ఆవేదన చెందుతున్నారు.

పెరిగిపోయిన నిల్వలు..

జీడిపప్పు నిల్వలు పెరిగిపోవడంతోనే పిక్కల ధరలు తగ్గుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. లక్షల విలువైన పప్పు ఫ్యాక్టరీల్లో నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో చాలామంది వ్యాపారులు పిక్కలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కొన్ని దేశాలకు జీడిపప్పు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారుల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. ఈ నిల్వలు తగ్గితే జీడిపిక్కల ధరలు పెరిగే అవకాశం ఉంది.

గిట్టుబాటు ధర కల్పించాలి

ఈ ఏడాది జీడిపిక్కల దిగుబడి తగ్గింది. పంటలకు పెట్టుబడి పెరిగింది. పిక్కలు ధరలు తగ్గితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గిట్టుబాటు కల్పించి వ్యాపారులతో పాటు అధికారులు రైతులకు అండగా నిలవాలి. జీడిపిక్కల బస్తా రూ.వెయ్యి తగ్గడంతో ఆందోళన చెందుతున్నాం

-సైన కేశవరావు, జీడి రైతు, చినవంక.

Updated Date - May 13 , 2026 | 11:32 PM