నిలిచిన జీడి ఎగుమతులు
ABN , Publish Date - Apr 09 , 2026 | 10:59 PM
Palasa Cashew stopped ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం పలాస జీడిమార్కెట్‌పైనా పడింది. గల్ఫ్ దేశాలపై పలాస జీడిమార్కెట్ ఆధారపడగా.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్‌లో అంతంతమాత్రంగానే అమ్మకాలు సాగుతున్నాయి.
పలాస జీడిపప్పుపై పశ్చిమాసియా యుద్ధం దెబ్బ
విదేశాలకు ఆగిన ఎగుమతులు
స్థానిక మార్కెట్‌లో విక్రయాలు అంతంతమాత్రమే
వ్యాపారులకు తప్పని ఇబ్బందులు
పలాస, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం పలాస జీడిమార్కెట్‌పైనా పడింది. గల్ఫ్ దేశాలపై పలాస జీడిమార్కెట్ ఆధారపడగా.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్‌లో అంతంతమాత్రంగానే అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో ఏ జీడి పరిశ్రమకు వెళ్లినా.. జీడిపప్పు నిల్వలు దర్శనమిస్తున్నాయి. లావాదేవీలు సాగక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
పలాస జీడిమార్కెట్‌లో ఒక్కోసారి ధరలు తక్కువగా ఉన్నా రవాణాకు ఇబ్బందులు ఉండేవి కావు. అరువు పద్ధతిలోనైనా జీడిపప్పు చెల్లిపోయేది. ఇక్కడి నుంచి జీడిపప్పు ఎక్కువగా కేరళతోపాటు దుబాయ్, గల్ఫ్ దేశాలకు ప్రతినెలా సుమారు 100 టన్నులు ఎగుమతి అయ్యేది. కాగా ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచీ పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. మార్కెట్‌లో జీడిపిక్కలు, పప్పు ధరలు పెరిగిన నేపథ్యంలో అమ్మకాలు కూడా అదేస్థాయిలో పెరగాలి. కానీ ఎక్కడి పప్పు నిల్వలు అక్కడే పేరుకుపోయాయి. దీంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీడిపప్పు తయారీ కోసం కార్మికులకు రోజువారీ వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. విక్రయాలు లేకపోవడంతో నగదు కోసం ఫైనాన్స్ వ్యాపారులు, బ్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే కొన్ని జీడి పరిశ్రమల యజమానులు పది రోజుల నుంచి బంద్ పాటిస్తున్నారు. ఉన్న నిల్వలను కొద్దోగొప్పో ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద వ్యాపారులకు మాత్రం ఆ పరిస్థితి లేదు. తప్పనిసరిగా ట్రేడర్లకు అమ్ముకుంటేనే నగదు రూపంలో ఆదాయం సమకూరుతుంది. ఎగుమతి నిలిచిపోవడంతో మొత్తం సరుకు నిల్వ ఉంచుతున్నారు. యుద్ధం ముగిస్తే తప్ప ఎగుమతులకు ఆస్కారం లేదని పేర్కొంటున్నారు.
దేశీయంగా జీడిపప్పు అమ్మకాలు సాధారణంగా ఉంటాయి. పండుగల సమయంలో మాత్రమే అమ్మకాలు జోరందుకుంటాయి. ప్రస్తుతం జీడిపిక్కల సీజను కావడంతో పిక్కలు కొనుగోలు చేయడమా, ఉన్న సరకులు అమ్ముకోవడమా అనే సందేహంలో వ్యాపారులు ఉన్నారు. ఇదిలా ఉండగా దళారులు మాత్రం గ్రామాల్లో జీడిపిక్కలు కొనుగోలు చేసుకొని నిల్వ ఉంచుతున్నారు. యుద్ధం పూర్తవగానే అధిక ధరకు అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు.
పెద్ద దెబ్బే
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల జీడి పరిశ్రమలకు పెద్ద దెబ్బే తగిలింది. ఎగుమతులు పూర్తిగా నిలిచిపోగా, వియాత్నం వంటి దేశాల నుంచి రావాల్సిన జీడి గింజలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రస్తుతం స్వదేశంలో లభించే పిక్కలపైనే ఆధారపడాల్సి వస్తోంది. యుద్ధం కొనసాగితే వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనిపై ప్రభుత్వమే స్పందించి జీడిపప్పు ఎగుమతి, దిగుమతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి.
- మల్లా శ్రీనివాసరావు, జీడి పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు, పలాస