డీసీసీబీలో నగదు కొరత
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:47 PM
Farmers in trouble టెక్కలిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో నగదు కొరత కారణంగా రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం విక్రయించిన నగదును తమ ఖాతాలో నుంచి తీసుకునేందుకు సహకార బ్యాంకుకు వెళ్లిన రైతులకు.. ప్రస్తుతం డబ్బులు లేవని సిబ్బంది చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
అరకొరగా చెల్లింపులు
ఆందోళనలో రైతులు
టెక్కలి, జనవరి 5(ఆంధ్రజ్యోతి):
నందిగాం మండలం రాంపురం పంచాయతీ జయపురానికి చెందిన పప్పల బారికి అనే రైతు బ్యాంకు ఖాతాకు ధాన్యం విక్రయించిన నగదు జమైంది. ఆ నగదును తీసుకునేందుకు సోమవారం టెక్కలిలో జిల్లాకేంద్ర సహకార బ్యాంకుకు వెళ్లాడు. విత్‌డ్రా ఫారం నింపి క్యాషియర్‌కు అందజేశాడు. కాగా.. ప్రస్తుతం నగదు లేదని.. తర్వాత రావాలని క్యాషియర్ చెప్పడంతో ఆ రైతు అవాక్కయ్యాడు.
................
టెక్కలిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో నగదు కొరత కారణంగా రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం విక్రయించిన నగదును తమ ఖాతాలో నుంచి తీసుకునేందుకు సహకార బ్యాంకుకు వెళ్లిన రైతులకు.. ప్రస్తుతం డబ్బులు లేవని సిబ్బంది చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. సోమవారం టెక్కలిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు టెక్కలి, నందిగాం మండలాల నుంచి పలువురు రైతులు నగదు విత్‌డ్రా చేసేందుకు వచ్చారు. కాగా, బ్యాంకు సిబ్బంది డబ్బులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. సంక్రాంతి వేళ తమ అవసరాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
జిల్లామొత్తంగా 25 సహకార బ్యాంకు శాఖలు ఉన్నాయి. రైతులు ధాన్యం విక్రయించిన డబ్బులు ప్రతిరోజు రూ.ఐదు కోట్ల నుంచి రూ.పది కోట్ల వరకు వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. సహకార బ్యాంకు మెయిన్ బ్రాంచ్ శాఖ నుంచి ఆయా బ్యాంకులకు నగదు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం మెయిన్ బ్రాంచ్ అరకొరగా నగదు సరఫరా చేస్తుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోజుకి ఒక్కో శాఖకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు మాత్రమే మెయిన్ బ్రాంచ్ ఇస్తోంది. దీంతో రైతులు ఖాతాల్లో రూ.లక్షల ఉన్నా.. ఒక్కొక్కరికీ రూ.20వేలు, ఒత్తిడి చేసిన వారికి రూ.50వేలు మాత్రమే బ్యాంకు అధికారులు, సిబ్బంది చెల్లిస్తున్నారు. తమ ఖాతాల్లో జమైన నగదును తీసుకునేందుకు కూడా ఇన్ని ఆంక్షలు ఏంటని రైతులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తమకు అవసరం మేర డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ విషయమై టెక్కలి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ చంద్రరావు వద్ద ప్రస్తావించగా మెయిన్ బ్రాంచి నుంచి రూ.20లక్షలు తెచ్చి రైతులకు ఉన్న మేరకు చెల్లింపులు చేస్తామని తెలిపారు.