Share News

మహిళా ఎస్‌ఐపై దాడి, అసభ్యప్రవర్తన.. వైసీపీ నేతలపై కేసు

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:38 AM

Complaint filed by female SI in Amadalavalasa జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ పేరిట వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పర్యటన సాక్షిగా ఆ పార్టీ శ్రేణులు బరితెగించాయి. గురువారం శ్రీకాకుళం కొత్తరోడ్డు జంక్షన్‌ వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న బూర్జ స్టేషన్‌ మహిళా ఎస్‌ఐ ప్రవల్లికపై ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌, వైసీపీ నాయకులు అనుచితంగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

మహిళా ఎస్‌ఐపై దాడి, అసభ్యప్రవర్తన.. వైసీపీ నేతలపై కేసు
కొత్తరోడ్డు వద్ద బూర్జ ఎస్‌ఐ చుట్టూ గుమిగూడి అసభ్యంగా ప్రవర్తిస్తున్న వైసీపీ శ్రేణులు(ఫైల్‌)

  • చింతాడ రవికుమార్‌, మరో 20 మందిపై..

  • ఆమదాలవలసలో మహిళా ఎస్‌ఐ ఫిర్యాదు

  • బాధ్యులపై కఠినచర్యలకు సీఎం ఆదేశం

  • శ్రీకాకుళం, జూలై 31(ఆంధ్రజ్యోతి): జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ పేరిట వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పర్యటన సాక్షిగా ఆ పార్టీ శ్రేణులు బరితెగించాయి. గురువారం శ్రీకాకుళం కొత్తరోడ్డు జంక్షన్‌ వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న బూర్జ స్టేషన్‌ మహిళా ఎస్‌ఐ ప్రవల్లికపై ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌, వైసీపీ నాయకులు అనుచితంగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీసి.. మహిళా ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా ఎస్‌ఐ ప్రవల్లిక శుక్రవారం ఆమదాలవలస పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమదాలవలస ఎస్‌ఐ సనపల బాలరాజు విచారణ చేపట్టి చింతాడ రవికుమార్‌తోపాటు మరో 20 మందిపై కేసులు నమోదు చేశారు.

  • ఏ1 చింతాడ రవికుమార్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 109, 189(2), 191(2), 221, 121, 74, 79, 351(2), రెడ్‌ విత్‌ 190 కింద హత్యాయత్నం, విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై దాడి, అసభ్యప్రవర్తన తదితర నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో 20 మంది అనుచరులపైనా ఇదే తరహాలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చింతాడ రవికుమార్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసి, అనుచరులతోపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • ఎఫ్‌ఐఆర్‌ ఎలా లీకైంది?

  • వైసీపీ నాయకులపై, అనుచరులపై కేసు నమోదు చేసిన విషయం అధికారికంగా బయటకు రాకముందే.. తనపై ఏఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో వివరిస్తూ నిందితుడు చింతాడ రవికుమార్‌ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. తనపై ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులను, సెక్షన్లను వివరిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశారు. ‘‘తన తప్పేమీ లేదని, ఎస్‌ఐ ప్రవల్లిక ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నారని, ఆమెకు జాగ్రత్త చెప్పానని. అదే సమయంలో జనాలు ‘జై జగన్‌’ అని అరిచారని’’ తెలిపారు. కాగా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగానే.. సెక్షన్లతోపాటు ఎలా లీకైందంటూ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. చింతాడ రవికుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. నిందితుడికి పోలీసుల వివరాలు ముందుగానే లీక్‌ చేసిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 01 , 2026 | 12:38 AM