Share News

మంచంపై మోసుకుంటూ.. వరద నీటిని దాటించి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:40 AM

అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని తన తండ్రి.. బంధువుల సహాయంతో మంచంపై మోసుకుంటూ, ఐదు అడుగుల లోతులో ఉన్న వరద నీటిలో నడుస్తూ ఆస్పత్రికి తరలించిన ఘటన పొందూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.

మంచంపై మోసుకుంటూ.. వరద నీటిని దాటించి
శివను మంచంపై మోసుకుంటూ అండర్‌ పాసేజీని దాటిస్తున్న దృశ్యం

- కుమారుడిని ఆస్పత్రికి తరలించిన తండ్రి

- సహకరించిన కుటుంబ సభ్యులు

- బొడ్డేపల్లి అండర్‌పాసేజీ వద్ద కష్టాలు

పొందూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని తన తండ్రి.. బంధువుల సహాయంతో మంచంపై మోసుకుంటూ, ఐదు అడుగుల లోతులో ఉన్న వరద నీటిలో నడుస్తూ ఆస్పత్రికి తరలించిన ఘటన పొందూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. బొడ్డేపల్లి రైల్వేగేటు వద్ద ఉన్న అండర్‌ పాసేజీలో రోజుల తరబడి నీరు నిలిచిపోతుంది. ఈ అండర్‌ పాసేజీలో చేరే నీరు పక్కనున్న నాగావళి నదిలోకి వెళ్తుంటుంది. అయితే తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నదిలో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. ఐదురోజులవుతున్నా నదిలో నీరు తగ్గడం లేదు. దీంతో అండర్‌ పాసేజీలోని నీరు నదిలోకి వెళ్లడంలేదు. దీంతో అందులో ఐదు అడుగుల వరకు నీరు నిల్వ ఉంటోంది. దీనిగుండానే బెలమాం గ్రామస్థులు శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, బెలమాం గ్రామానికి చెందిన ఐదు తరగతి విద్యార్థి సోపేటి శివ మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స చేసినా తగ్గకపోవడంతో తండ్రి జగ్గారావు శ్రీకాకుళం తీసుకువెళ్లాలనుకున్నాడు. అండర్‌ పాసేజీలో నీరు ఉండడంతో ఏ వాహనం శ్రీకాకుళం వెళ్లడంలేదు. దీంతో శివను మంచంపై పడుకోబెట్టి బంధువులతో కలిసి మోసుకుంటూ అండర్‌ పాసేజీని దాటించారు. అక్కడి నుంచి ఆటోలో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న రైల్వే గేటు మార్గాన్ని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:40 AM