..వయా పలాస
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:29 AM
Ganja smuggling via Palasa కాశీబుగ్గ సబ్‌డివిజన్ పోలీసు, పలాస రైల్వేపోలీసుల సాధారణ తనిఖీల్లో తరచూ వందల కిలోల్లో గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఒడిశా నుంచి.. పలాస మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా సాగుతోంది. రైల్వేస్టేషన్, ప్రధాన జంక్షన్లలో అనుమానిత వ్యక్తుల బ్యాగులను పోలీసులు తనిఖీ చేస్తే చాలు.. గంజాయి పట్టుబడుతోంది.
ఒడిశా నుంచి గంజాయి రవాణా
ఇతర రాష్ట్రాలకు తరలింపు
రైలు మార్గంలో అత్యధికంగా..
కూలీలకు డబ్బులిచ్చి సరఫరా
సూత్రధారులు ఒడిశా స్మగ్లర్లు
పలాస, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 17న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు 18.4 కిలోల గంజాయితో పలాస రైల్వేస్టేషన్ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. గుణుపూర్(ఒడిసా) బ్లాక్ తబలగూడ గ్రామానికి చెందిన మున్నాబరదాన్, రామగిరి బ్లాక్‌కు చెందిన సంజ నఖర్జి ఒడిశా నుంచి గంజాయిని విజయవాడకు తరలించేందుకు పలాస రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టుబడగా.. వారిద్దరినీ అరెస్టు చేశారు.
గత నెల 25న 33 కిలోల గంజాయితో తమిళనాడుకు చెందిన ముగ్గురిని పలాస రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరు గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకువెళ్తుండగా పట్టుబడ్డారు.
పదేళ్ల కిందట పలాస రైల్వేస్టేషన్ వద్ద ఓ ఆర్పీఎఫ్ ఎస్‌ఐ స్థాయి అధికారే గంజాయిని ఏకంగా తన కార్యాలయంలోనే ప్యాకెట్లుగా తయారుచేసి రైలుమార్గం ద్వారా హైదరాబాద్, బెంగుళూరు తరలించి పోలీసులకు పట్టుబడ్డారు. అప్పట్లో ఆయన కార్యాలయం నుంచి ఏకంగా 200 కిలోలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల పలాస రైల్వే పోలీస్టేషన్ పరిధి సోంపేట రోడ్డులో 118 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దర్ని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
కాశీబుగ్గ సబ్‌డివిజన్ పోలీసు, పలాస రైల్వేపోలీసుల సాధారణ తనిఖీల్లో తరచూ వందల కిలోల్లో గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఒడిశా నుంచి.. పలాస మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా సాగుతోంది. రైల్వేస్టేషన్, ప్రధాన జంక్షన్లలో అనుమానిత వ్యక్తుల బ్యాగులను పోలీసులు తనిఖీ చేస్తే చాలు.. గంజాయి పట్టుబడుతోంది. ఇప్పటివరకూ గంజాయితో పట్టుబడిన వారంతా కేవలం రోజువారి కూలీలు, బ్రోకర్లు మాత్రమే. గంజాయి పండించే రైతులు కానీ, విక్రయదారులు కానీ పదేళ్లలో ఒక్కసారి కూడా పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పోలీసులు వివిధ మార్గాల ద్వారా గంజాయిని అరికడుతుంటే ఒడిశా, తమిళనాడుకు చెందిన కూలీల ద్వారా ఆ ప్రాంతాలతోపాటు మన రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో కూడా సరుకులు అందిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
గంజాయి ఎక్కువగా ఆంధ్రా-ఒడిశా బోర్డరు మల్కన్‌గిరి, ఆర్.ఉదయగిరి, మోహన, గజపతి బ్లాకుల్లో ఉన్న మారుమూల కొండలు, అటవీ ప్రాంతాల్లో విరివిగా పండిస్తున్నారు. గిరిజనులను పావులుగా వినియోగించుకుని గంజాయి వ్యాపారులు (బ్రోకర్లు).. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ బయానా ఇస్తూ పండిస్తుంటారు. పంట పండిన తరువాత రైౖతుల నుంచి బ్రోకర్లు ఒడిశా బోర్డరు వరకూ తీసుకువచ్చి అక్కడ నుంచి కూలీలు, చిన్నచిన్న బ్రోకర్లుకు అప్పగిస్తారు. నిఘా లేకపోతే రైలుమార్గం, నిఘా ఎక్కువయితే రోడ్డు మార్గం గుండా గంజాయిని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబాయి ప్రాంతాలకు తరలిస్తుంటారు. పది కిలోలకు ఒక్కో కూలీకు రూ.5వేల నుంచి వారి చేసిన సాహసం బట్టి రూ.10వేల వరకూ ఇస్తుంటారు. అయితే తమకు ఒరిజినల్ వ్యాపారి ఎవరనేది తెలియదని, కనీసం వారి ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉండవని పట్టుబడిన కూలీలు చెబుతున్నారు. కేవలం బ్రోకర్ల ఫోన్ ఆదేశాల మేరకు వారు చెప్పిన ఆనవాళ్లు కలిగిన వ్యక్తులకు సరకును అందిస్తామని చెబుతున్నారు. గంజాయి రవాణా వెనుక గూఢాచార్యం దాగి ఉంటుంది. కిలో రూ.3వేలకు కొనుగోలు చేసిన గంజాయి.. రవాణా పూర్తయిన తరువాత రూ.30వేలు నుంచి రూ.50వేలు ధర పలుకుతుంటుంది. తక్కువ రిస్క్‌తో అధిక లాభాలు రావడంతో గంజాయినే వ్యాపార వస్తువుగా ఎంచుకున్నారన్నది స్పష్టమవుతోంది. ఒడిశాలో పండించిన గంజాయిని దేశవ్యాప్తంగా రవాణా జరుగుతున్న వేళ పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం మన జిల్లానుంచే కాకుండా విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, పాడేరు మన్యం ప్రాంతాల నుంచి కూడా ఒడిశా బోర్డురు నుంచి రవాణా వ్యవహారంపై పూర్తిస్థాయి పర్యవేక్షణ అవసరం ఉంది.
మరింత నిఘా
పూర్తిస్థాయిలో గంజాయి రవాణా కట్టడికి అన్ని ప్రాంతాల్లోనూ మరింత నిఘా పెట్టాం. రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఒడిశా నుంచి వచ్చే బస్సులపై నిరంతరం నిఘా ఉంటుంది. గంజాయిపై ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది. గంజాయితో పట్టుబడితే కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని జైలుకు తరలిస్తాం.
- టి.భవాని, డీఎస్పీ, కాశీబుగ్గ