ఇట్టే వాలిపోతున్నారు!
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:20 AM
Struggles for votes ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. త్వరలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, ఆశావహులు, చోటా నేతలు గ్రామాల్లో ఏ శుభకార్యమైనా.. విషాదమైనా.. అక్కడ వాలిపోతున్నారు. పరామర్శలు.. పలకరింపులతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు.
పరామర్శలతో అభ్యర్థులు, అనుచరులుబిజీ
శుభకార్యాల్లో చోటా నేతల హల్‌చల్
చావు, పుట్టుకల వద్దకు ఆదే తీరు
ఓట్లు కోసం తప్పవు పాట్లు
రణస్థలం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి):
రణస్థలం మండలంలోని ఓ గ్రామంలో వృద్ధుడు వయోభారంతో చనిపోయాడు. కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు వచ్చారు. కానీ ఎప్పుడూ కనిపించని కొత్తముఖాలు దర్శనమిచ్చాయి. అక్కడ ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేస్తున్నవారు, ఆపై సర్పంచ్‌గా పోటీచేయాలనుకునే ఆశావహుల హల్‌చల్ కనిపించింది. అంత్యక్రియల్లో అంతా తామై వ్యవహరించడం విశేషం.
ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఇటీవల అనారోగ్యానికి గురై శ్రీకాకుళంలోని ఆస్పత్రిలో చేరింది. ఈ విషయం తెలుసుకున్న వివిధ పార్టీల చోటా నేతలు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. పండ్లు, హార్లిక్స్ సీసా అందజేశారు. ఎప్పుడూ ఊర్లో పలకరించనివారు ఆస్పత్రికి వచ్చి పరామర్శించడంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.
రణస్థలం మండలంలోని ఓ గ్రామంలో సామాజిక కట్టుబాట్లు ఎక్కువ. గతంలో వివాదాలు తలెత్తిన సందర్భాలున్నాయి. కానీ ఇటీవల ఓ సామాజికవర్గ శుభకార్యంలో మరో సామాజికవర్గానికి చెందిన నేతలు కనిపించారు. అక్కడ విందు ఏర్పాట్లలో వారే ప్రధాన భూమిక పోషించారు.
ఇలా ఈ పరిణామాలన్నింటికీ కారణం ‘స్థానిక’ ఎన్నికలు. కేవలం ఇక్కడ రాజకీయాలు మాత్రమే కాదు. మాకేంటి అనే పరిస్థితి ఎక్కువ. పలకరింపులు, పరామర్శలకే పల్లె ప్రజలు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే చోటా నేతలు ఎన్నికలు వస్తే పల్లెల్లో ఓటర్ల చుట్టూ తిరుగుతారు. ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. త్వరలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, ఆశావహులు, చోటా నేతలు గ్రామాల్లో ఏ శుభకార్యమైనా.. విషాదమైనా.. అక్కడ వాలిపోతున్నారు. పరామర్శలు.. పలకరింపులతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు.
ఫోన్‌లో సంభాషణలు..
గ్రామాల్లో మాట పట్టింపులు ఎక్కువ. గతంలో నాయకుడు పట్టించుకోలేదనో, లేకుంటే పథకాలు ఇవ్వలేదనో చెప్పి చాలా మంది దూరమవుతుంటారు. అటువంటి వారికి అభ్యర్థులు, నేతలు ఫోన్లు చేస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి మాత్రం తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. అలాగే వలసకూలీలపై నేతలు, అభ్యర్థుల దృష్టి పడింది. అక్కడి వారితో నిరంతర టచ్‌లో ఉంటున్నారు. ఇక ఓటర్ల జాబితాలను చేతిలో పెట్టుకొని నేరుగా కాంటాక్ట్ అవుతున్నవారు ఉన్నారు. ముందుగానే వారికి చెల్లింపులు చేస్తున్నారు. ఎక్కువ మంది ఉంటే అక్కడి నుంచి వచ్చేందుకు వీలుగా బస్సులు, వాహనాలను బుక్ చేస్తున్నారు. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం వారికి కొంత మొత్తం చెల్లిస్తున్నారు. అంతా డిజిటల్ పేమెంట్ కావడంతో క్షణాల్లోనే ఈ తతంగం జరిగిపోతోంది.