Share News

కాలువలు ఇలా.. సాగునీరు ఎలా?

ABN , Publish Date - May 28 , 2026 | 01:03 AM

వంశధార ఎడమ ప్రధాన కాలువ దిగువనున్న పిల్ల కాలువలు అధ్వానంగా ఉన్నాయి. పూడిక, ముళ్ల పొదలతో నిండిపోయి దారుణంగా కనిపిస్తున్నాయి.

కాలువలు ఇలా.. సాగునీరు ఎలా?
గంగరాంలో నీరు పారేందుకు వీలు లేకుండా ఉన్న వంశధార పిల్ల కాలువ

- పూడిక, ముళ్ల పొదలతో నిండిన వంశధార పిల్ల కాలువలు

- అభివృద్ధికి నోచుకోని వైనం

- ఖరీఫ్‌ దగ్గరపడడంతో రైతాంగం ఆందోళన

కోటబొమ్మాళి, మే 28 (ఆంధ్రజ్యోతి): వంశధార ఎడమ ప్రధాన కాలువ దిగువనున్న పిల్ల కాలువలు అధ్వానంగా ఉన్నాయి. పూడిక, ముళ్ల పొదలతో నిండిపోయి దారుణంగా కనిపిస్తున్నాయి. నీరు పారేందుకు వీలు లేకుండా తయారయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నెలలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంకానుండడంతో శివారు భూములకు సాగునీరు ఎలా? అని మదనపడుతున్నారు. కోటబొమ్మాళి వంశధార సెక్షన్‌ పరిధిలో 25ఆర్‌ మేఘవరం, 36ఆర్‌ నర్సాపురం, 36ఆర్‌ గంగరాం, 38ఆర్‌ గోవిందపురం, 39ఆర్‌ సంతబొమ్మాళి పిల్ల కాలువల ద్వారా సుమారు 10వేల హెక్టార్లలో భూములకు ప్రతి ఏటా ఖరీఫ్‌లో సాగునీరు అందుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పిల్ల కాలువలు అభివృద్ధికి నోచుకోలేదు. ఐదేళ్ల పాటు ఎలాంటి పనులు నిర్వహించలేదు. దీంతో యలమంచిలి, శ్రీజగన్నాథపురం, గంగరాం, లఖందిడ్డి తదితర పంచాయతీల పరిధిలోని కాలువలు పూడిక, ముళ్ల పొదలతో నిండిపోయాయి. ఫలితంగా శివారు గ్రామాలు లకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఉపాధి హామీ పనుల ద్వారానైనా కాలువలను బాగు చేయాలని రైతులు కోరుతున్నారు.

మంత్రి దృష్టికి తీసుకెళ్లాం..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు ద్వారా పిల్ల కాలువలను బాగు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయకుండా పూర్తిగా విస్మరించింది. దీంతో కాలువలు అధ్వానంగా మారాయి. ఈ విషయాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఇటీవల తీసుకెళ్లాం. త్వరలో పిల్ల కాలువలను బాగు చేస్తామని, పూడికతీత పనులు నిర్వహించి ఖరీఫ్‌లో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

- కర్రి అప్పారావు, నీటిసంఘం డైరెక్టర్‌, గోవిందపురం డీసీ

పనులు చేపడతాం

అన్ని పిల్ల కాలువల్లో మరమ్మతు పనులు చేపడతాం. పూడిక తీయించి సాగునీరు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు మాకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలో పనులు ప్రారంభించి ఈ ఖరీఫ్‌లో శివారు గ్రామాలకు చెందిన ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.

- ధర్మాన లోకేష్‌, వంశధార ఏఈ, కోటబొమ్మాళి.

Updated Date - May 28 , 2026 | 01:03 AM