Share News

కారులో వచ్చి.. పుస్తెలతాడు చోరీ

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:41 PM

32.4 grams of gold recovered వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ కి పాల్పడిన ముగ్గురిని శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద ఆ ముగ్గురు నిందితులను తన కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.

కారులో వచ్చి.. పుస్తెలతాడు చోరీ
మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద, పోలీసుల అదుపులో నిందితులు

  • ముగ్గురి అరెస్టు..

  • 32.4 గ్రాముల బంగారం రికవరీ

  • మూడు సెల్‌ఫోన్లు, ఒక కారు సీజ్‌

  • శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ కి పాల్పడిన ముగ్గురిని శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద ఆ ముగ్గురు నిందితులను తన కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ‘గత నెల 30న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శ్రీకాకుళం మండలం నందగిరిపేటకు చెందిన పాతిన భూదేవమ్మ అనే వృద్ధురాలి మెడలో 32.4 గ్రాముల బంగారం పుస్తెలతాడును తెంచి పట్టుకుపోయారు. ఆమె కుమారుడు రామచంద్రరావు ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనలో ఆమదాలవలస మండలం మెట్టక్కివలసకి చెందిన మెండ వెంకటరమణ, గుంట ప్రమీల, గుంట జగదీశ్వరరావు ఉన్నట్టు గుర్తించారు. ఈ ముగ్గురూ వృద్ధురాలి ఇంటి వద్ద 20రోజులపాటు రెక్కీ నిర్వహించారు. గత నెల 30న కారులో వచ్చి.. నందగిరిపేట వద్ద ఆపారు. వృద్ధురాలు పాతిన భూదేవమ్మ ఇంటికి ప్రమీల, వెంకటరమణ ఖాళీసీసాతో వెళ్లి నీరు కావాలని అడిగారు. భూదేవమ్మ నీరు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్తుండగా.. ఆమె మెడలో ఉన్న బంగారం పుస్తెలతాడును వెంకటరమణ తెంపి దొంగిలించాడు. తర్వాత అక్కడి నుంచి ముగ్గురూ కారులో పరారయ్యారు. బంగారం పుస్తెలతాడు గురువారం అమ్మేందుకు వెళ్తున్న సమయంలో ఆ ముగ్గురినీ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. చోరీకి గురైన రూ.5లక్షల విలువైన 32.4 గ్రాముల బంగారం పుస్తెలతాడును రికవరీ చేశాం. వారు వినియోగించిన మూడు సెల్‌పోన్లు, కారును సీజ్‌ చేశామ’ని డీఎస్పీ వివేకానంద తెలిపారు. సమావేశంలో శ్రీకాకుళం రూరల్‌ సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ రాము ఉన్నారు.

  • డ్రోన్లకు అనుమతి ఉండాల్సిందే.

  • అనుమతి లేకుండా డ్రోన్లు ఎగురవేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద హెచ్చరించారు. వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు డ్రోన్లు ఎగురవేసేముందు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. రిజిష్టర్‌ సంస్థ అయి ఉండాలన్నారు. హైసెక్యూరిటీ జోన్లపై డ్రోన్లు ఎగురవేయరాదని స్పష్టం చేశారు.

Updated Date - Feb 05 , 2026 | 11:41 PM