బై.. బై.. వెళ్లొస్తాం..
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:09 AM
Sankranti celebrations have ended జిల్లాలో సంక్రాంతి సంబరాలు శనివారంతో ఉత్సాహంగా ముగిశాయి. శనివారం ముక్కనుమను పురస్కరించుకుని కొత్త అల్లుళ్లు.. కుటుంబ సభ్యులతో కలిసి అత్తారింటికి చేరుకున్నారు.
ముగిసిన సంక్రాంతి వేడుకలు
తిరుగుముఖం పడుతున్న ఉద్యోగులు, వలసకూలీలు
అరసవల్లి/ నరసన్నపేట, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంక్రాంతి సంబరాలు శనివారంతో ఉత్సాహంగా ముగిశాయి. శనివారం ముక్కనుమను పురస్కరించుకుని కొత్త అల్లుళ్లు.. కుటుంబ సభ్యులతో కలిసి అత్తారింటికి చేరుకున్నారు. అలాగే కొంతమంది ఆడపిల్లలకు ముక్కుకుట్టే ఉత్సవాలు నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. మరోవైపు స్వగ్రామాల నుంచి వలస జీవులు, ఉద్యోగులు, విద్యార్థులు తిరుగు పయనమయ్యారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. శ్రీకాకుళం, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ వెళ్లే బస్సుల కోసం ఎగబడ్డారు. మరికొందరు ప్రైవేటు బస్సులు, వాహనాల్లో గమ్యస్థానాలకు పయనమయ్యారు. పండగ సందర్భంగా నాలుగు రోజులు సరదాగా గడిపిన వారంతా.. భారమైన హృదయాలతో వెళ్లొస్తామంటూ బంధువులకు వీడ్కోలు చెప్పారు.