బినామీ రికార్డులు సృష్టించి..
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:01 AM
Encroachment of Basavanna Bandha నరసన్నపేట బజారువీధిలోని బసవన్న చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. గత రెండు రోజులుగా అక్రమార్కులు ఈ చెరువు స్థలంలో యంత్రాలతో మట్టి వేసి చదునుచేస్తూ.. ఆక్రమణకు పాల్పడుతున్నారు.
బసవన్న బంద ఆక్రమణ
రూ.కోట్ల విలువ చేసే భూములపై అక్రమార్కుల కన్ను
తెరవెనుక పెద్దల హస్తం
నరసన్నపేట, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట బజారువీధిలోని బసవన్న చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. గత రెండు రోజులుగా అక్రమార్కులు ఈ చెరువు స్థలంలో యంత్రాలతో మట్టి వేసి చదునుచేస్తూ.. ఆక్రమణకు పాల్పడుతున్నారు. సత్యవరం రెవెన్యూ పరిధిలో ఈ చెరువు సుమారు 2.09 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎస్‌ఎల్‌ఆర్‌లో ఈ చెరువు బందగా నమోదై ఉంది. పట్టణం నడిబొడ్డున రాజులచెరువు నుంచి నీరు ఈ బసవన్న బందకు వెళ్లి గతంలో వందలాది ఎకరాలకు సాగునీరు అందేది. ఈ బసవన్న బంద పక్కనే 20 ఏళ్ల కిందట ఓ కల్యాణమండపం నిర్మించారు. క్రమేపీ వాహనాల పార్కింగ్ కోసం కొద్దికొద్దిగా మట్టి వేసి ఆక్రమణలు చేపట్టారు. గతంలో ఈ చెరువు ఆక్రమణకు కొందరు స్థానిక నాయకులు యత్నించారు. అప్పటి శ్రీకాకుళం ఆర్డీవో జి.గణేష్ ఈ ఆక్రమణలను గుర్తించి తొలగించారు. చెరువు పరిరక్షణకు కంచె ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ షరామామూలే.
ఇటీవల కొందరు తమకు బందపై పూర్తి హక్కులు ఉన్నాయని బినామీ పత్రాల స్పష్టించి కోట్లాది విలువ చేసే ఈ బందను ఆక్రమణకు పూనుకున్నారు. ఈ మేరకు రికార్డులను కూడా ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రెండురోజులుగా రాజులు చెరువు నుంచి నీరు వచ్చే మార్గం కూడా మట్టితో కప్పేసి చెరువు ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్దలు వెనుకుండి నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి బసవన్న బందను ఆక్రమణదారుల చెర నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా.. బసవన్న బందను పరిశీలిస్తామని తెలిపారు. ఆక్రమణలు చేపడితే.. అక్రమార్కులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.