Share News

చౌకగా నొక్కేసి.. అమ్మేసి!

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:58 PM

రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తోంది.

చౌకగా నొక్కేసి.. అమ్మేసి!
రేషన్‌ బియ్యం

- రేషన్‌ బియ్యం పక్కదారి

- అక్రమాలకు అడ్డాగా స్టాక్‌పాయింట్లు

- బస్తాకు ఐదు కిలోల తగ్గుదల

- టెక్కలి టు ఒడిశాకు తరలింపు

-పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం

- టెక్కలి మండలం నరహరిపురం జీసీసీ డిపో పరిధిలో 460 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా ఈ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు 84 క్వింటాల బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ రావాల్సి ఉంది. కానీ, ప్రతి నెలా నాలుగు క్వింటాల వరకు బియ్యం తక్కువగా వస్తున్నాయి. దీంతో ఇతరుల వద్ద బియ్యం కొనుగోలు చేసి కార్డుదారులకు అందిస్తున్నట్లు జీసీసీ డిపో సేల్స్‌మన్‌ చెబుతున్నాడు. కమీషన్‌ కూడా సరిపడకపోవడంతో అప్పుచేపి పెడుతున్నట్లు లబోదిబోమంటున్నాడు.

- టెక్కలి మండలం జీడిపేట జీసీసీ డిపోలో 480 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించి 75 క్వింటాల బియ్యం రావాల్సి ఉంది. కానీ, ప్రతినెలా ఐదు క్వింటాల వరకు తక్కువ డిపోకు వస్తుండడంతో సేల్స్‌మన్‌ ఆందోళన చెందుతున్నాడు.

టెక్కలి/రూరల్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తోంది. చౌక బియ్యాన్ని రుచిమరిగిన అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూ రూ.లక్షలకు పడగలెత్తుతున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఈ కేంద్రాల నుంచి రేషన్‌ డిపోలకు సరఫరా చేసే బియ్యంలో ఐదు కేజీల వరకు తరుగు ఉంటుంది. ఈ తరుగు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. డీలర్లు కూడా తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో రేషన్‌ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 6,57,758 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రతినెలా 9,665.987 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. సంబంధిత డిపోలకు ఆమదాలవలస, జి.సిగడాం, ఇచ్ఛాపురం, జలుమూరు, కంచిలి, లావేరు, మెళియాపుట్టి, నరసన్నపేట, పలాస, శ్రీకాకుళం, సరుబుజ్జిలి, టెక్కలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ సరుకులను సరఫరా చేస్తుంటారు. అయితే, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డిపోలకు వచ్చే బియ్యంలో తరుగుదల ఉంటుంది. 50 కిలోల బియ్యం బస్తాకు సుమారు 5 కిలోలు తగ్గడంతో ఆ భారం తమపై పడుతుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల పరిధిలోని సిబ్బందికి తెలియపర్చినా పట్టించుకోవడం లేదంటున్నారు. గోడౌన్‌లో ఎలుకలు సంచరించడం కారణంగా తరుగుదల వస్తున్నాయని సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. కొన్ని చౌకధరల దుకాణాల్లో కార్డుదారులకు డీలర్లు కావాలనే బియ్యం తూకం తగ్గించి ఇస్తున్నారు. అవకాశాలను బట్టి రెండు నుంచి మూడు కేజీలు తగ్గించి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల డీలర్ల వద్ద 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు బియ్యం బ్యాక్‌లాగ్‌లో ఉండిపోతున్నాయి. ఈ బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద వే-బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని, ఇక్కడ రేషన్‌ బియ్యాన్ని తూకం వేసి డిపోలకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.

టెక్కలి టు ఒడిశా..

టెక్కలి మండలంలో అధికంగా రేషన్‌ మిల్లులు ఉన్నాయి. కొంతమంది వ్యాపారులు పలు గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని మిల్లర్లకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీపాలిష్‌ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు. ఆ తరువాత సంచుల్లో నింపి ఒడిశాకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రతి నెలా వందలాది కిలోల రేషన్‌ బియ్యం పక్కదోవపడుతున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. కొన్నిసార్లు అధికారులు పట్టుకున్నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వ్యాపారులు బయటపడుతున్నారు.

దృష్టిసారిస్తాం

టెక్కలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద వే-బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. తరచూ రేషన్‌ డిపోలను తనిఖీ చేస్తాం. గోదాములపై దృష్టి సారిస్తాం.

-అనిల్‌కూమార్‌ పాత్రో, సీఎస్‌ డీటీ, టెక్కలి

రీప్లేస్‌ చేస్తాం

తామరాపల్లి గోదాం నుంచి ప్రతినెలా బియ్యం వస్తుంటాయి. బియ్యం తరుగుదలపై ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండడం లేదు. డీలర్లకు మరీ తక్కువగా బియ్యం వస్తే ఆ బస్తాలు మాకు అందజేస్తే వాటిని రీప్లేస్‌ చేస్తాం.

-ప్రవీణ్‌కుమార్‌, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాం ఇన్‌చార్జి, టెక్కలి.

Updated Date - Jan 13 , 2026 | 11:58 PM