బస్సులు.. రైళ్లు కిటకిట
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:11 AM
Sankranti celebrations have ended సంక్రాంతి సంబరాలు ముగిశాయి. సొంత ఊళ్లలో సందడిగా గడిపిన వలస జీవులు ఉపాధి కోసం మళ్లీ పట్నం బాట పట్టారు. ఉద్యోగులు విధుల్లో చేరేందుకు శుక్రవారం సాయంత్రానికే స్వస్థలాల నుంచి బయలుదేరారు.
ముగిసిన సంక్రాంతి సంబరాలు
తిరుగు పయనమైన జనం
ఎక్కడ చూసినా రద్దీ
పలాస/రూరల్/మందస/పాతపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంబరాలు ముగిశాయి. సొంత ఊళ్లలో సందడిగా గడిపిన వలస జీవులు ఉపాధి కోసం మళ్లీ పట్నం బాట పట్టారు. ఉద్యోగులు విధుల్లో చేరేందుకు శుక్రవారం సాయంత్రానికే స్వస్థలాల నుంచి బయలుదేరారు. ఆదివారం అమావాస్య సెంటిమెంట్‌తో కొంతమంది ఉండిపోయారు. వారితో పాటు అక్కడక్కడా పల్లెల్లో ఉండిపోయిన వారు సోమవారం తిరుగు పయనమయ్యారు. సెలవులు పూర్తి కావడంతో విద్యాలయాలు సోమవారం నుంచి తెరచుకున్నాయి. సంక్రాంతికి వచ్చిన వారంతా పనిచేస్తున్న.... చదువుకుంటున్న ప్రాంతాలకు వెళ్లిపోతుండడంతో జిల్లాలోని రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు సోమవారం రద్దీగా కనిపించాయి. పలాస రైల్వేస్టేషన్‌లో ఇసుక పోస్తే రాలనంతగా ప్రయాణికులతో రద్దీగా మారింది. దీంతో ఆర్పీఎఫ్, రైల్వే పోలీసులు స్టేషన్ వద్ద ప్రయాణికులను అప్రమత్తం చేశారు. సికింద్రాబాద్, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా, విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్ల నుంచి సాధారణ భోగీల వరకూ ప్రయాణికులు నిలబడే ప్రయాణిస్తుండడం కనిపించింది. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సాధారణంగా బస్సులు ఎక్కేవారి సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. కాశీబుగ్గ రాజీవ్ బస్ కాంప్లెక్స్ వద్ద ఎక్కువ మంది బస్సులు ఎక్కుతుంటారు. దీనికి భిన్నంగా సీట్ల కోసం ఎక్కువ మంది ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనే బస్సులు ఎక్కారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి వైపు వెళ్లే బస్సులన్నీ అక్కడే కిక్కిరిసిపోయాయి. దీంతో బస్సుల్లో కూడా ప్రయాణికులు నిలబడే గంటల పాటు ప్రయాణించారు. ఇంటర్‌సిటీ రైలును మిగిలిన రైల్వే స్టేషన్లలో కూడా నిలపడంతో రైలులో ప్రయాణించే వారి సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. కనీసం నిలబడేందుకు చిన్న స్థలం ఉంటే చాలని అనేక మంది ఆపసోపాలు పడ్డారు. అత్యధిక శాతం నిలుచొనే ప్రయాణించారు. ఒక్క ఏసీ కోచ్‌లు తప్ప మిగిలిన భోగీలన్నీ నిండుకుండల్లా కనిపించాయి. ఇక జిల్లాలోని శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, మందస తదితర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లిన బస్సులన్నీ రద్దీగానే కనిపించాయి.