బరువు.. బాధ్యత
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:12 AM
The Burden of Heavy Schoolbags in Private Schools ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాల బరువు పెరిగిపోతోంది. స్కూల్ బ్యాగ్ పాలసీ అమలు కావడం లేదు. మోతాదుకు మించి పుస్తకాల బ్యాగులు మోయలేక పోవడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులే ఆ భారం మోస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లినప్పుడు.. ఇంటికి వచ్చినప్పుడు.. వారే పుస్తకాల బ్యాగులను మోస్తూ కనిపిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల మోత
అమలుకాని స్కూల్‌బ్యాగ్ పాలసీ
విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పని అవస్థలు
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాల బరువు పెరిగిపోతోంది. స్కూల్ బ్యాగ్ పాలసీ అమలు కావడం లేదు. మోతాదుకు మించి పుస్తకాల బ్యాగులు మోయలేక పోవడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులే ఆ భారం మోస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లినప్పుడు.. ఇంటికి వచ్చినప్పుడు.. వారే పుస్తకాల బ్యాగులను మోస్తూ కనిపిస్తున్నారు. జాతీయ విద్యావిధానం స్కూల్‌బ్యాగ్ పాలసీ-2020 ప్రకారం బ్యాగు బరువు.. విద్యార్థి శరీర బరువులో పదిశాతం కన్నా ఎక్కువ ఉండకూడదు. నర్సరీ నుంచి ఎల్‌కేజీ, యూకేజీ వరకు ఎలాంటి స్కూల్‌బ్యాగ్ ఉండకూడదు, 1,2 తరగతులు 1.6 నుంచి 2.2 కిలోలు, 3,4,5 తరగతులకు 1.7 నుంచి 2.5 కిలోలు, 6,7 తరగతులకు 2నుంచి 3 కిలోల వరకు స్కూల్‌బ్యాగ్ బరువు ఉండాలి. 8వతరగతకి 2.5 కిలోల నుంచి 4 కిలోలు, 9, 10 తరగతుల విద్యార్థులకు 5 కిలోల వరకు స్కూల్ బ్యాగు బరువు ఉండాలి. ప్రతినెలా మూడో శనివారం ‘నో బ్యాగ్‌డే’ను తప్పనిసరిగా పాటించాలి. పాఠశాలల్లో లాకర్స్ సిస్టం ఏర్పాటు చేసి నోటు పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అందులో విద్యార్థులు ఉంచుకునేలా చూడాలి. స్వచ్ఛమైన నీరు, తరగతి గదుల్లో గాలి, వెలుతురు ఉండాలి. కానీ చాలా ప్రైవేటు పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం అంతగా లేకపోవడంతో విద్యార్థులు ఇళ్ల నుంచి పుస్తకాలతోపాటు తాగునీటి బాటిళ్లను సైతం మోసుకెళ్లాల్సి వస్తోంది. పరిమితికి మించి స్కూల్‌బ్యాగు బరువు కారణంగా భుజాలు, మోకాళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పుస్తకాల భారం తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అధికారులు ఏం చేస్తున్నారు?
ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా విద్యాశాఖ అధికారులు కళ్లగప్పగించి చూస్తున్నారు. ఫిర్యాదులు రాలేదన్న సాకుతో మిన్నకుండి పోతున్నారు. కనీసం జాతీయ విద్యావిధానం ప్రకారం స్కూల్‌బ్యాగ్ పాలసీ-2020 ప్రైవేటు పాఠశాలల్లో అమలువుతోందా? అని కూడా తనిఖీలు చేయడం లేదు. కార్యాలయాలకే పరిమితం అవుతూ పరోక్షంగా ప్రైవేటు పాఠశాలలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంపై డీఈవో రవికుమార్ వద్ద ప్రస్తావించగా.. ప్రైవేటు పాఠశాలలకు మార్గదర్శకాలు పాటించాలని ఎంఈవోల ద్వారా ఆదేశాలు జారీ చేశామన్నారు. స్కూల్‌బ్యాగు బరువు తక్కువగా ఉండాలని.. లేదంటే ఆయా పాఠశాలలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.