బులియన్ మార్కెట్ కళకళ
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:27 AM
బులియన్ మార్కెట్ కళకళాడుతోంది. శ్రావణ మాసం కారణంగా కొద్ది రోజులుగా బంగారు దుకాణాలన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి.
- శ్రావణ మాసంలో పెరిగిన బంగారం కొనుగోళ్లు
- రద్దీగా జ్యువెలరీ షాపులు
- ప్రస్తుతం బిస్కెట్ బంగారం గ్రాము రూ.14,900
నరసన్నపేట, ఆగస్టు 19(ఆంఽధ్రజ్యోతి): బులియన్ మార్కెట్ కళకళాడుతోంది. శ్రావణ మాసం కారణంగా కొద్ది రోజులుగా బంగారు దుకాణాలన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు కొత్త ఆభరణాలు ధరించడం ఆనవాయితీ. ముందుగానే ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున వాటిని పూజలో పెట్టుకుని ధరిస్తారు. చాలామంది చెవిదిద్దులు, కాసులు, చిన్నచిన్న బంగారు వస్తువులు కొంటుంటారు. బంగారం ధర కొంత తగ్గడం కూడా కొనుగోళ్లకు ఓ కారణమైంది. దీంతో జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, కాశీబుగ్గ, సోంపేట, టెక్కలి వంటి పట్టణాల్లో ప్రధాన జ్యువెలరీ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.
- ఇరాన్-అమెరికా యుద్ధం ఆరంభం నుంచి బంగారం ధర గణనీయంగా పెరిగింది. ఒకానొక దశలో గ్రాము ధర రూ.20వేలకు చేరువైంది. అక్కడ నుంచి తగ్గుతూ వచ్చి ఇటీవల వరకూ 12,800 వద్ద వద్ద స్థిరంగా ఉంది. ఈ సమయంలో చాలామంది కొనుగోళ్లకు మక్కువ చూపారు. శ్రావణమాసంలో పెళ్లుళ్లు ఉండడంతో ముందుస్తుగానే వస్తువులకు ఆర్డర్లు ఇచ్చారు. ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేయడంతో చాలామంది మహిళలు ఎంతోకొంత బంగారం కొనేందుకు ఆసక్తి చూపారు. అప్పటినుంచి మొదలైన కొనుగోళ్లు గత పదిహేనురోజుల నుంచి ఊపందుకున్నాయి. దీనికి కారణం ధర రోజు రోజుకూ పెరగడమే. ప్రస్తుతం గ్రాము బిస్కెట్ బంగారం రూ.14,900 ఉండగా, అర్నమెంట్ బంగారం రూ.14,100 ఉంది. ఈ పదిరోజుల్లో గ్రాముకు సుమారు రూ.1200 పెరిగింది. ధర ఇంకా పెరగవచ్చున్న ఊహగానాలు వినిపిస్తుండటంతో చాలామంది స్థోమత బట్టి కొనుగోలు చేస్తున్నారు.
ధర మరింత పెరిగే అవకాశం
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. యూరప్‌లో కొనుగోళ్లు పెరగడమే దీనికి కారణం. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ఉధృతి తగ్గడం, క్రూడ్ ఆయిల్ ధర పతనం, మదుపుదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టడం పెరగుదలకు కారణమని చెప్పవచ్చు. ఇదే విధంగా కొనసాగితే ధరలు పెరిగే అవకాశం ఉంది. గత పదిహేనురోజులుగా కొనుగోళ్లు బాగా పెరిగాయి.
- ఉణ్న రంగనాథ్, మాజీ అధ్యక్షుడు, నరసన్నపేట బులియన్ మార్కెట్ అసోసియేషన్