లక్షలతో నిర్మించారు.. వృథాగా వదిలేశారు
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:25 PM
జలుమూరులో పౌరసరఫరాల గోదాం వద్ద ఉన్న వే బ్రిడ్జి వృథాగా మారింది.
- పౌరసరఫరాల గోదాం వద్ద నిరుపయోగంగా వేబ్రిడ్జి
- తూకం వేయకుండా రేషన్ సరుకులు తరలిస్తున్న వైనం
- బాగు చేయాలని జేసీ ఆదేశించినా భేఖాతరు
జలుమూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జలుమూరులో పౌరసరఫరాల గోదాం వద్ద ఉన్న వే బ్రిడ్జి వృథాగా మారింది. గోదాము నుంచి రేషన్ సరుకులను డీలర్లకు పంపించినపుడు తరుగు లేకుండా తూకం వేసేందుకు గాను ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఈ వే బ్రిడ్జిని నిర్మించింది. వే బ్రిడ్జిపై తూకం వేయించి సరుకులను పంపించాల్సిన బాధ్యత గోదాం ఇన్‌చార్జిపై ఉంది. కానీ, వే బ్రిడ్జిపై తూకం వేయకుండానే ట్రాక్టర్లకు సరుకులను లోడ్ చేసి డీలర్లకు పంపిస్తున్నారు. దీంతో బియ్యంలో తరుగు వస్తుందని డీలర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. గత నెలలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఈ గోదాంను తనిఖీ చేశారు. వే బ్రిడ్జి నిరుపయోగంగా ఉండడాన్ని గమనించి రెండు వారాల్లోగా వినియోగంలోకి తీసుకురావాలని, సరుకులను ఇక్కడ తూకం వేసిన తరువాతే డీలర్లకు పంపించాలని అధికారులకు ఆదేశించారు. అయినప్పటికీ దాన్ని బాగు చేయించకపోవడంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి వే బ్రిడ్జిని విని యోగంలోకి తీసుకురావాలని డీలర్లు కోరుతున్నారు.