Share News

భవనాలు ఇలా..ఆదాయం ఎలా?

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:12 AM

పలాస మునిసిపాలిటీకి ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో చేపట్టిన వివిధ భవనాల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

 భవనాలు ఇలా..ఆదాయం ఎలా?
కాశీబుగ్గ బస్‌ కాంప్లెక్స్‌పై నిలిచిన భవన నిర్మాణం

- అర్ధాంతరంగా నిలిచిన పనులు

- పలాస మునిసిపాలిటీలో నిధులు వృథా

- ఆదాయ వనరులపై నిర్లక్ష్యం

పలాస, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పలాస మునిసిపాలిటీకి ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో చేపట్టిన వివిధ భవనాల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ పనులు సకాలంలో చేపట్టకపోవడంతో విలువైన ప్రజాధనం వృథా కావడంతో పాటు నెలనెలా వచ్చే ఆదాయానికి కూడా గండిపడింది. కాశీబుగ్గ రాజీవ్‌గాంధీ బస్‌ కాంప్లెక్స్‌, మీ సేవ కేంద్రంపై భవనాలను నిర్మించడానికి మునిసిపాలిటీ పదేళ్ల కిందట శ్రీకారం చుట్టినా నేటికి ఆ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం శ్లాబ్‌లెవల్‌ వరకు ఉన్న ఈ నిర్మాణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో పాటు మహాత్మాగాంధీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ద్వారా దీర్ఘకాలికంగా అద్దె రూపంలో మునిసిపాలిటీకి వచ్చే ఆదాయానికి కూడా గండి పడింది. నిబంధనల పుణ్యమా మొత్తం షాపులన్నీ బంద్‌ చేయాల్సి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

- కాశీబుగ్గ రాజీవ్‌గాంధీ బస్‌ కాంప్లెక్స్‌ నుంచి నిత్యం ఏడు వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్‌ కాంప్లెక్స్‌ వద్ద ఓ భవనాన్ని నిర్మించి డార్మెటరీ, హోటల్‌ నిర్వహణకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని మునిసిపల్‌ అధికారులు భావించారు. ఈ మేరకు ఏడేళ్ల కిందట భవన నిర్మాణానికి టెండర్లు పిలిచారు. సుమారు రూ.25 లక్షలతో పనులు ప్రారంభించారు. దీంతో ప్రయాణికులు చాలా సంతోషించారు. అయితే శ్లాబ్‌ లెవల్‌ వరకూ పనులు చేపట్టి విడిచిపెట్టేశారు. ఎందుకు పూర్తి చేయలేకపోయారో అనే దానిపై ఇప్పటికీ ఇంజనీరింగ్‌ అధికారుల వద్ద సమాధానం లేదు. మొత్తం నిధులన్నీ వృథా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- నిత్యం రద్దీగా ఉండే కాశీబుగ్గ మీ సేవా కేంద్రం (ప్రస్తుతం వార్డు సచివాలయం)పై భాగంలో మునిసిపాలిటీకి సంబంధించిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణం కోసం పదేళ్ల కిందట శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. శ్లాబ్‌ దశ వరకు నిర్మాణం చేపట్టి అర్ధాంతరంగా పనులు నిలుపుదల చేశారు. దీంతో నిధులన్నీ వృథా అయ్యాయి. ఆ భవనం పూర్తయిఉంటే కనీసం మునిసిపల్‌ సమావేశాలకైనా వినియోగించుకోవడా నికి అవకాశం ఉండేది. లేదా రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చినా మునిసిపాలిటీకి ఆదాయం సమకూరేది.

- కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్‌ రోడ్డులో రెండున్న దశాబ్దాల కిందట మహాత్మాగాంధీ పునరావాస షాపులను నిర్మించారు. అప్పట్లో నామమాత్రపు అద్దెతో చిరువ్యాపారులకు వాటిని కేటాయించారు. ఎనిమిదేళ్ల కిందట మునిసిపల్‌ అధికారులు ఆ షాపుల అద్దెను 200 శాతం పెంచారు. ఒక్కసారి అంత మొత్తంలో అద్దెలు పెరగడంతో కొంతమంది కోర్టుకు వెళ్లగా, మిగిలిన వారంతా షాపులు ఖాళీ చేసి మునిసిపాలిటీకి అప్పగించారు. అప్పటి నుంచి ఆ షాపులన్నీ ఖాళీగా ఉన్నాయి. రూ.వెయ్యికి అద్దెకు ఇచ్చినా ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నిర్మించిన షాపులు చిరు వ్యాపారులకు తప్పా మిగిలిన వారికి ఎవరికీ సరిపడవు. దీంతో పాటుగా అద్దె పెరగడంతో వాటిలో ఉండేందుకు ఎవరూ సాహసించడం లేదు. నిబంధనలు సడలించి ఉంటే షాపులన్నీ ఖాళీ అయ్యేవి కావు. దీంతో పాటు ఐడీఎస్‌ఎంటీ నిధులతో నిర్మించిన షాపుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పటికే సగానికి పైగా షాపులు ఖాళీ అయ్యాయి. వీటిని పొందాలన్నా అద్దెల మోత ఎక్కువ కావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు.

Updated Date - Jan 29 , 2026 | 12:12 AM