Share News

బీపీఎస్‌నా.. ఊహు!

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:01 AM

BPS.. not interested మునిసిపాలిటీల్లో అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ భవనాలు క్రమబద్ధీకరించేందుకు బీపీఎస్‌(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌-2025)ను ప్రకటించింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ఈ పథకం ద్వారా మరో అవకాశం కల్పించింది.

బీపీఎస్‌నా.. ఊహు!

  • అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు అరకొరగా దరఖాస్తులు

  • అవగాహన కల్పిస్తున్నా ముందుకురాని నిర్మాణదారులు

  • పలాస, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ భవనాలు క్రమబద్ధీకరించేందుకు బీపీఎస్‌(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌-2025)ను ప్రకటించింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ఈ పథకం ద్వారా మరో అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌కుమార్‌ జీవో నెంబరు 225ను నెల రోజుల కిందట జారీచేశారు. 1985 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 మధ్యకాలంలో నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇందులో 1997 సంవత్సరానికి ముందు నిర్మించిన భవనాలకు అపరాధ రుసుంలో 25 శాతం రాయితీ కల్పించారు. మురికివాడల్లో ఉన్న గృహాలకు 50 శాతం భారీ తగ్గింపు ఇచ్చారు. దీని ప్రకారం జిల్లాలో 2వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని పట్టణాభివృద్ధిశాఖ అంచనాకు వచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా జిల్లాలో అక్రమ భవనాల క్రమబద్ధీకరణ నిర్మాణదారులు విముఖత చూపుతున్నారు. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పురపాలక సంఘాల్లో వేల సంఖ్యలో అక్రమ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. కానీ బీపీఎస్‌కు ఆన్‌లైన్‌లో అరకొరగానే దరఖాస్తులు వచ్చాయి. పట్టణాభివృద్ధిశాఖ అధికారులు నిర్మాణదారుల వద్దకు వెళ్లి బీపీఎస్‌పై అవగాహన కల్పిస్తున్నా ఫలితం లేకపోతోంది. వాస్తవానికి పట్టణాభివృద్ధి శాఖ అనుమతులు పొందిన తర్వాతే ప్లాన్‌ ప్రకారం భవనాలు నిర్మించాలి. కాగా వాస్తు, ఇతర అవసరాలు, రహదారులు సక్రమంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అనుకున్న విధంగా నిర్మాణాలు సాగించలేకపోతున్నారు. దీంతో అధికారులు భారీ అపరాధ రుసుం విధిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కఠినతరం కావడంతో నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈక్రమంలో అక్రమ భవనాల నిర్మాణానికి ఎక్కువశాతం మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు బీపీఎస్‌కు దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు అయోమయం చెందుతున్నారు. రానున్న మార్చి 11తో బీపీఎస్‌కు గడువు ముగియనుందని, ఈ లోగా నిర్మాణదారులు దరఖాస్తులు చేసుకోవాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు.

  • బీపీఎస్‌కు దరఖాస్తులు ఇలా..

  • -------------------------------------------------

  • మునిసిపాలిటీ లక్ష్యం దరఖాస్తులు

  • -------------------------------------------------

  • శ్రీకాకుళం (కార్పొరేషన్‌) 600 122

  • పలాస-కాశీబుగ్గ 100 11

  • ఇచ్ఛాపురం 110 10

  • ఆమదాలవలస 150 16

    --------------------------------------------------

Updated Date - Jan 03 , 2026 | 12:01 AM