Share News

నిధులివ్వండి

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:05 AM

Budget in the Assembly tomorrow జిల్లా అభివృద్ధి రథచక్రాలు ముందుకు సాగాలంటే ‘నిధుల’ ఇంధనం అత్యవసరం. ఈనెల 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సిక్కోలు వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు.

నిధులివ్వండి
గొట్టాబ్యారేజీ వద్ద వంశధార (ఫైల్‌)

  • రేపు అసెంబ్లీలో బడ్జెట్‌

  • వంశధార, ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులపై ఆశలు

  • మూలపేట పోర్టు, పారిశ్రామిక ప్రగతిపై కూడా..

  • సాగునీరు, ఆరోగ్యం, పర్యాటకానికి ప్రాధాన్యమివ్వాలని జిల్లావాసుల విజ్ఞప్తి

  • శ్రీకాకుళం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధి రథచక్రాలు ముందుకు సాగాలంటే ‘నిధుల’ ఇంధనం అత్యవసరం. ఈనెల 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సిక్కోలు వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలోని ఈ కీలక బడ్జెట్‌ సమావేశాల్లో జిల్లాకు అగ్రతాంబూలం దక్కుతుందని రైతులు, నిరుద్యోగులు, మేధావులు భావిస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అరకొర నిధులతో ఆగిపోయిన పనులు ఈసారైనా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • ఇవీ ప్రధాన డిమాండ్లు

  • వంశధార, నాగావళి నదుల అనుసంధానం

  • శ్రీకాకుళం నగరంలో రింగ్‌ రోడ్డు నిర్మాణం, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు

  • డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్శిటీకి అదనపు భవనాలు, హాస్టల్‌ వసతులు

  • తీరప్రాంత మత్స్యకారులకు జెట్టీల నిర్మాణం, డీజిల్‌ రాయితీ పెంపు

  • సాగునీరే జీవనాధారం

  • జిల్లా రైతులు ప్రధానంగా వంశధార నదిపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. వంశధార స్టేజ్‌-2 ఫేజ్‌-2 పనులు పూర్తి కావాలంటే దాదాపు రూ.200 కోట్లు తక్షణం కేటాయించాలి. ముఖ్యంగా హిరమండలం రిజర్వాయర్‌ నిర్వాసితుల పరిహారం, 87, 88 ప్యాకేజీల పనులు పూర్తి కాకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం గగనమవుతోంది. అలాగే మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటికి ఈ బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు జరగాలి. తోటపల్లి కాలువల ఆధునికీకరణకు నిధులు విదిల్చితే తప్ప మెట్టప్రాంతం సస్యశ్యామలం కాదు.

  • మౌలిక వసతులు.. పారిశ్రామిక ప్రగతి..

  • వలసల జిల్లాగా పేరున్న శ్రీకాకుళంలో పారిశ్రామిక వెలుగులు నింపేందుకు మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరగాలి. పోర్టు అనుసంధాన రహదారులు, మౌలిక వసతులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. పైడి భీమవరం పారిశ్రామికవాడలో కాలుష్య నియంత్రణ చర్యలతోపాటు, కొత్తగా ఆమదాలవలస, టెక్కలి ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలన్న డిమాండ్‌ ఉంది. బుడగట్లపాలెం, మంచినీళ్లపేట తీరం వద్ద జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌ల నిర్మాణం వేగవంతానికి పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించాల్సి ఉంది. మత్స్యకారులు ఉపాధికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఈ అంశమై జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయించేలా ఒత్తిడి తేవాల్సి ఉంది.

  • పర్యాటకం, వైద్యం, ఐటీడీఏ..

  • ఉమ్మడి జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన గ్రామాల రోడ్ల అనుసంధానానికి భారీగా నిధులు కావాలి. ఇక ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నిర్మించిన రీసెర్చ్‌ సెంటర్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి, డయాలసిస్‌ కేంద్రాల నిర్వహణకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. జిల్లాలో అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ ‘టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌’ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తే జిల్లా ఆదాయం పెరుగుతుంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించి.. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు, నధుల అనుసంధానం.. పారిశ్రామికాభివృద్ధి చెందేలా.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు కృషి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:05 AM