Share News

బకాయి బిల్లుకు లంచం

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:19 AM

Acb traff in Sub-Treasury Office ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, బకాయిలు చెల్లించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవాల్సిన ఖజానా (ట్రెజరీ) కార్యాలయమే అవినీతికి అడ్డాగా మారింది. తోటి ఉద్యోగిని అని కూడా చూడకుండా.. ఆమెకు రావాల్సిన న్యాయమైన బకాయిల బిల్లు మంజూరుకు ‘మామూళ్లు’ డిమాండ్‌ చేసిన ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు.

బకాయి బిల్లుకు లంచం
ఏసీబీకి పట్టుబడిన ఎస్టీవో నల్లా రవిప్రసాద్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ అంబకండి శ్రీనివాసరావు

  • శ్రీకాకుళం ఉప ఖజానాలో ఏసీబీ దాడులు

  • రూ.15వేలు తీసుకుంటూ దొరికిన ఎస్టీవో, సీనియర్‌ అకౌంటెంట్‌

  • శ్రీకాకుళం/ క్రైం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, బకాయిలు చెల్లించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవాల్సిన ఖజానా (ట్రెజరీ) కార్యాలయమే అవినీతికి అడ్డాగా మారింది. తోటి ఉద్యోగిని అని కూడా చూడకుండా.. ఆమెకు రావాల్సిన న్యాయమైన బకాయిల బిల్లు మంజూరుకు ‘మామూళ్లు’ డిమాండ్‌ చేసిన ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. శ్రీకాకుళం ఉపఖజానా కార్యాలయం (సబ్‌ ట్రెజరీ ఆఫీస్‌)లో మంగళవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు డాడిలో ఎస్టీవో నల్లా రవిప్రసాద్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ అంబకండి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

  • అసలేం జరిగిందంటే..

  • శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం-1 సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లోపింటి హేమరాగిణికి సంబంధించిన జీతం బకాయిల వ్యవహారమే ఈ అవినీతికి కేంద్రబిందువు. ఆమె గతంలో అనారోగ్య కారాణాల రీత్యా దాదాపు ఏడాదిన్నర పాటు (2022 జనవరి 3 నుంచి 2023 మే 3 వరకు) సెలవులో ఉన్నారు. ఆ కాలాన్ని ప్రభుత్వం ‘ఎక్స్‌ట్రాడినరీ లీవ్‌’ (లాస్‌ ఆఫ్‌ పే)గా పరిగణించింది. అనంతరం ఆమె విధుల్లో చేరగా.. కలెక్టర్‌ ఆమె ప్రొబేషన్‌ను 2023 మే 5 నాటికి డిక్ల్లర్‌ చేశారు. కానీ 2023 మే 5 నుంచి 2025 డిసెంబరు 31 వరకు ఆమెకు రావాల్సిన జీతం బకాయిలు(శాలరీ అరియర్స్‌) అందలేదు. కేవలం రూ.15వేల గౌరవ వేతనంతో ఆమె నెట్టుకొస్తున్నారు. ఎట్టకేలకు ఆమెకు రావాల్సిన రూ. 4,34,697 బకాయి బిల్లు తయారై, ఈ నెల 10న శ్రీకాకుళం ఉప ఖజానా కార్యాలయానికి చేరింది.

  • తనకు రావాల్సిన డబ్బుల కోసం బాధితురాలు హేమ రాగిణి ట్రెజరీ ఆఫీసు చుట్టూ తిరిగారు. ఈ నెల 22న ఆమె సీనియర్‌ అకెంటెంట్‌ అంబకండి శ్రీనివాసరావును కలవగా, బిల్లు మంజూరు చేయాలంటే రూ.20వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె ఎస్టీవో(ఉప ఖజానా అధికారి) నల్లా రవిప్రసాద్‌ను 23న కలిసి న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఆయన కూడా మూమూళ్లు తప్పదని చెప్పడంతో.. చివరకు రూ.15వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వారి పథకం ప్రకారం బాధితురాలు.. మంగళవారం శ్రీకాకుళం ఉప ఖజానా కార్యాలయంలో ఎస్టీవో, సీనియర్‌ అకౌంటెంట్‌కు రూ.15వేలు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐ భాస్కరరావు సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా వారిద్దరినీ పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీవో రవిప్రసాద్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయపు గదుల్లో కూడా సోదాలు చేశారు. వారిద్దరినీ అరెస్టు చేసి విశాఖపట్నంలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే 14400 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కానీ, 9440440057 కు గానీ ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.

  • నిందితుల నేపథ్యం ఇదీ..

  • నల్లా రవిప్రసాద్‌(ఎస్టీవో).. 2010లో సీనియర్‌ అకౌంటెంట్‌గా చేరారు. ఇచ్ఛాపురం, శ్రీకాకుళం జిల్లా ఖజానా ఆఫీసుల్లో పనిచేశారు. 2025 సెప్టెంబరులో ఎస్టీవోగా పదోన్నతి పొంది శ్రీకాకుళం వచ్చారు.

  • అంబకండి శ్రీనివాసరావు(సీనియర్‌ అకౌంటెంట్‌).. 2010లో కారుణ్య నియామకం కింద జూనియర్‌ అకౌంటెంట్‌గా చేరారు. 2013లో పదోన్నతి పొంది, 2023 జూన్‌ నుంచి శ్రీకాకుళం సబ్‌ ట్రెజరీలో పనిచేస్తున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:19 AM