‘జల్‌జీవన్’కు ఊపిరి!
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:28 PM
జల్‌జీవన్ మిషన్...ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది.
- కేంద్ర బడ్జెట్‌లో రూ.4వేల కోట్ల కేటాయింపు
- జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 2,095 పనులు
- పెండింగ్‌లో మరికొన్ని
- నిధుల ప్రకటనతో చిగురించిన ఆశలు
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జల్‌జీవన్ మిషన్...ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి వీలు అవుతుందని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో సమానంగా మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకుండా జాప్యం చేసింది. ఆ ప్రభావం పనులపై పడింది. జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా కనీస స్థాయిలో పనులు జరగలేదు. దీంతో జల్‌జీవన్ మిషన్‌పై నీలినీడలు అలుముకున్నాయి. అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు జిల్లాలో జలజీవన్ మిషన్ పథకంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఆయన చేసిన ప్రత్యేక విన్నపాలు.. ఆపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించడంతో ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్‌లో సైతం ప్రాధాన్యతాంశంగా తీసుకుంది. దీంతో ఈ పథకంతో తాగునీటి కల్పన అన్నది శరవేగంగా జరుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. కేంద్ర బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జల్‌జీవన్ మిషన్ పనుల పూర్తిపై ఆశలు చిగురిస్తున్నాయి.
మంచి సంకల్పం..
జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలన్నదే లక్ష్యం. ఇప్పటికే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు రూ.700 కోట్లతో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి. కానీ కొలిక్కి రాలేదు. కానీ రెండో దశ అంటూ హడావుడి నడుస్తోంది. మరోవైపు వంశధార నదికి ఆనించి ఉన్న పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాలకు సైతం తాగునీటిని ఇదే ప్రాజెక్టు ద్వారా విస్తరించేందుకు నిర్ణయించారు. టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు తాగునీరు అందించే వీలుగా సారవకోట మండలం బొంతు వద్ద ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. అలాగే శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాలగాను సరుబుజ్జిలి మండలం వెన్నలవలస వద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.
అన్నిచోట్ల అదే పరిస్థితి..
జల్‌జీవన్ పనులు చేపట్టడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడు మ్యాచింగ్ గ్రాంట్ కిందట నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 4,286 పనులు మంజూరయ్యాయి. ఈ పనులు విలువ రూ.2,076 కోట్లు. ఇప్పటివరకూ పూర్తయిన పనులు కేవలం 1,198 మాత్రమే. చేసిన ఖర్చు రూ.889 కోట్లు. ఇంకా కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ.63 కోట్లు. 2,095 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 993 పనులు పెండింగ్‌లో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా జల్‌జీవన్ మిషన్‌కు నిధులు కేటాయించడంతో పనులు ఊపందుకుంటాయన్న అంచనాలు ఉన్నాయి.
పనులు జరిపిస్తాం
జిల్లాలో జల్‌జీవన్ మిషన్‌కు సంబంధించి పనులు జరుగుతున్నాయి. పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అయినా సరే పనులు జరిపించేందుకు సత్వర చర్యలు చేపట్టాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు జరిపిస్తాం.
-శంకరంబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, శ్రీకాకుళం