వంశధార కాలువకు గండి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:02 AM
Break for irrigation water జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు.. వంశధార ప్రధాన ఎడమ కాలువకు గండిపడింది. సారవకోట మండలం గుమ్మపాడు, అక్కివలస పరిధిలో (16వ కిలోమీటరు సమీపంలో) మంగళవారం వేకువజామున గండి పడడంతో సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- శివారు ప్రాంతాల సాగునీటికి బ్రేక్
- అధికారుల తీరుపై మంత్రి, కలెక్టర్ ఆగ్రహం
టెక్కలి/ కోటబొమ్మాళి/ జలుమూరు, జూలె 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు.. వంశధార ప్రధాన ఎడమ కాలువకు గండిపడింది. సారవకోట మండలం గుమ్మపాడు, అక్కివలస పరిధిలో (16వ కిలోమీటరు సమీపంలో) మంగళవారం వేకువజామున గండి పడడంతో సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంశధార ప్రధాన ఎడమ కాలువ.. నరసన్నపేట డివిజన్‌లో 55.75 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అక్కడ నుంచి 104.835 కిలోమీటర్ల వరకు టెక్కలి డివిజన్ పరిధిలో ఉంది. నరసన్నపేట డివిజన్ పరిధిలో నిర్వహణ నిధులు సుమారు రూ.కోటి ఖర్చు చేశారు. గత ఏడాది కూడా డీఎంఎఫ్ నిధులు కొంతమేరకు ఆ ప్రాంతంలో వెచ్చించారు. అయినా వంశధార ప్రధాన ఎడమకాలువకు గండి తప్పలేదు. నరసన్నపేట డివిజన్ పరిధిలో వంశధార అధికారులు డిస్ర్టిబ్యూటరీ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ప్రాధాన్యత ప్రధాన కాలువకు ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2,430 క్యూసెక్కుల సాగునీరు విడుదలకు అవకాశం ఉన్నా సోమవారం నుంచి 1,809 క్యూసెక్కులను అధికారులు గొట్టాబ్యారేజీ నుంచి ఎల్‌ఎంసీ వైపు విడిచిపెట్టారు. కాగా కాలువ గట్టు బలహీనంగా ఉండడంతో.. అక్కివలస సమీపంలో పడిన గండి మూలంగా ఒక్కసారిగా ప్రధాన ఎడమకాలువ వెంబడి వచ్చే సాగునీటికి బ్రేక్ పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు ఐదు మీటర్లు వరకు గండిపడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ గండి ప్రభావంతో ఎడమకాలువలో మూడు మీటర్లు ఎత్తుగా వస్తున్న నీరు ప్రస్తుతం 1.5మీటర్లకు పడిపోయింది.
మంత్రి, కలెక్టర్ ఆగ్రహం
వంశధార ప్రధాన ఎడమ కాలువకు గండిపడిన విషయం తెలుసుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఆ శాఖ అధికారులపై మండిపడ్డారు. నీటిపారుదల శాఖ అధికారులు ఏమి చేస్తున్నారు. లస్కర్లు ఉన్నారా, లేదా అన్నది ధ్వజమెత్తారు. యుద్ధప్రాతిపదికన గండి పూడ్చాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. కాలువల నిర్వహణ, బలహీన ప్రాంతాల గుర్తింపు, ముందస్తు మరమ్మతులు, నిరంతర తనిఖీలు చేపట్టడంలో అధికారులు విఫలం కావడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా బుధవారం నాటికి గండి పూడ్చేలా చర్యలు తీసుకుంటామని వంశధార ఎస్‌ఈ జి.రామచంద్రరావు తెలిపారు. ఈ గండి ప్రభావంతో అన్ని ఓటీలు ఓపెన్ చేశామని, బండింగ్ పటిష్ఠ పనులకు చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వంశధార ఈఈ మురళీమోహన్‌తో ఫోన్‌లో మాట్లాడి యుద్ధప్రాతిపదికన గండిని పూడ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.