బీఆర్‌ఏయూ స్నాతకోత్సవం వాయిదా
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:09 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడినట్లు సమాచారం.
రాజ్ భవన్ నుంచి వర్సిటీకి మెయిల్
ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత కరువు
అధికారికంగా ప్రకటించని అధికారులు
ఎచ్చెర్ల రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం 2008 జూన్ 25 ఏర్పడింది. ఈ 18 ఏళ్లలో రెండుసార్లు (2016, 2019) మాత్రమే స్నాతకోత్సవాలు జరిగాయి. 2022లో నిర్వహించాల్సి ఉండగా రద్దయింది. మూడో స్నాతకోత్సవం కోసం ఈ ఏడాది జూలై 30న అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. కాన్వోకేషన్‌లో సర్టిఫికెట్ల స్వీకరణ కోసం 2020 నుంచి 2025 మధ్య డిగ్రీలు సాధించిన విద్యార్థుల నుంచి ఈ నెల 13 వరకూ దరఖాస్తులు ఆహ్వానించారు. పీజీ, యూజీ విద్యార్థులు 300 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరుకావడం సాధ్యం కాదని, కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని రాజ్ భవన్ నుంచి వర్సిటీ రిజస్ట్రార్ కార్యాలయానికి మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు స్నాతకోత్సవం వాయిదా పడినట్లు విద్యార్థులకు సమాచారం అందించాలని సంబంధిత అధికారులు ఎగ్జామినేషన్ కార్యాలయానికి తెలియజేశారు. ఈ విషయాన్ని అధికారులు మాత్రం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. నోటిఫికేషన్ ఇచ్చినా స్నాతకోత్సవం నిర్వహణపై మాత్రం అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఏకపక్షంగా నోటిఫికేషన్?
ప్రస్తుతం వాయిదా నేపథ్యంలో పలు అంశాలపై విశ్వవిద్యాలయంలో చర్చ జరుగుతుంది. పాలక మండలి అనుమతి లేకుండా స్నాతకోత్సవం నోటిఫికేషన్ అధికారులు ఏక పక్షంగా ఇచ్చారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే స్నాతకోత్సవం వాయిదా పడిందని అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో క్లాస్ -2 పాలక మండలి సభ్యులను సైతం ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. క్లాస్-1లో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఉంటారు. ఆర్థిక, పరిపాలన పరమైన కీలక నిర్ణయాలకు ఉన్నతాధికారులు అనుమతి తప్పని సరి. అయితే, స్నాత కోత్సవంపై ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదన్నది సమాచారం. ప్రస్తుతం స్నాతకోత్సం వాయిదా పడినా మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు అన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఈ అంశంపై రిజస్ట్రార్ ఫ్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యను సంప్రదించగా మాట్లాడేందుకు ఇష్టపడలేదు.