కొన్నారు.. పడేశారు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:11 AM
టెక్కలి మేజర్ పంచాయతీలో లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన చెత్త సేకరణ రిక్షాలు నిరుపయోగంగా మారాయి.
- నిరుపయోగంగా చెత్త సేకరణ రిక్షాలు
- టెండర్లు పిలవకుండానే కొనుగోలు చేసిన వైనం
-రూ.64లక్షల ప్రజాధనం వృథా
- వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల విన్నపం
టెక్కలి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): టెక్కలి మేజర్ పంచాయతీలో లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన చెత్త సేకరణ రిక్షాలు నిరుపయోగంగా మారాయి. నిబంధనలు పక్కనపెట్టి కొనుగోలు చేసిన ఆ రిక్షాలను వినియోగించకుండా అధికారులు మూలన పెట్టేశారు. దీంతో ప్రజాధనం వృథాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
టెక్కలి మేజర్‌పంచాయతీలో 120కు పైగా వీధులు, 35వేలకు పైగా జనాభా ఉన్నారు. ఈ పంచాయతీకి కేవలం ఏడుగురు రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు, 40మంది కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు, 18మంది క్లాప్‌మిత్ర కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలనే లక్ష్యంతో ఎనిమిది నెలల కిందట అప్పటి పంచాయతీ కార్యదర్శి జి.వెంకట్రావు 40 చెత్త సేకరణ రిక్షాలను కొనుగోలు చేశారు. ఒక్కొక్క రిక్షాను రూ.16వేలుకు కొనుగోలు చేశారు. అయితే, టెండర్లు పిలవకుండా వీటిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రిక్షాలను వినియోగించుకుండా పంచాయతీ యంత్రాంగం తాత్సారం చేస్తోంది. దీంతో 40 రిక్షాలు టెక్కలి-తెంబూరు రోడ్డులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వృథాగా పడిఉన్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తుండడంతో పాడైపోతున్నాయి. ఈ రిక్షాలను వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజానీకం కోరుతున్నా పంచాయతీ యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
అమలు కాని ప్రణాళికలు
టెక్కలిలో పారిశుధ్యం మెరుగుకు మంత్రి కింజరాపు అచెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినా అవి అమలుకు నోచుకోవడం లేదు. టెక్కలిలో ఉన్న 200కు పైగా కాలువలు, ప్రధాన రహదారులు, కూడళ్లు, చెత్త, పండ్ల దుకాణాలు, హోటళ్లు, కిరాణా షాపులు, ఇతర షాపుల నుంచి వచ్చిన చెత్తను ప్రతిరోజూ తొలగించేందుకు పారిశుధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పారిశుధ్య కార్మికులతో రెండు విడతలుగా సమీక్షించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీకి చెందిన సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.50లక్షల విలువ గల కాంపెక్టర్, రూ.40లక్షలు విలువ గల డంపర్లు కొనుగోలు చేసి చెత్తసేకరణ మరింత సులభతరంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, నిధులు విడుదల కాకపోవడంతో కాంపెక్టర్, డంపర్లు కొనుగోలు జరగక పారిశుధ్య పనులకు అవాంతరం ఏర్పడుతుంది.
వినియోగంలోకి తెస్తాం..
చెత్త సేకరణ రిక్షాల కొనుగోలులో నిబంధనలు సక్రమంగా పాటించకపోవడంతో వాటిని వినియోగించడంలో తాత్సారం నెలకొంది. కాంపెక్టర్, డంపర్లు కొనుగోలుకు కలెక్టర్ అనుమతులు మంజూరు చేశారు. 40 చెత్త సేకరణ రిక్షాలను వినియోగంలోకి తీసుకువస్తాం.
-ఏవీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి టెక్కలి.