బీపీ, షుగర్లు పైపైకి!
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:10 AM
: జిల్లాలో మధుమేహం (షుగర్), అధిక రక్తపోటు(బీపీ) వ్యాధులు భయపెడుతున్నాయి.
- మధుమేహం వ్యాధిగ్రస్థులు 1.27లక్షల మంది
- అధిక రక్తపోటు బాధితులు 1.81 లక్షలు
- జిల్లాలో ఏటా పెరుగుతున్న కేసులు
- ఎన్సీడీ 4.0 సర్వేలో వెల్లడి
-తూతూ మంత్రంగా అవగాహన కార్యక్రమాలు
శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మధుమేహం (షుగర్), అధిక రక్తపోటు(బీపీ) వ్యాధులు భయపెడుతున్నాయి. ప్రతి ఏటా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అవగాహన లోపం, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోవడంతో అనేక మంది బీపీ, షుగర్ల బారిన పడుతున్నారు. జిల్లాలో నిర్వహించిన అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ) సర్వేలో ఇది వెల్లడైంది. జిల్లాలో చక్కెర వ్యాధిగ్రస్థులు 1.27లక్షల మంది, బీపీ వ్యాధిగ్రస్థులు 1.81 లక్షల మంది ఉన్నట్లు తేలింది.
మధుమేహం రోగులు 1,27,720..
జిల్లాలో ఇప్పటి వరకు ఎన్సీడీ 2.0, 3.0 సర్వే జరిగింది. తాజాగా, 4.0 సర్వే కూడా చేపట్టి మొత్తం మధుమేహం రోగులు 1,27,720 ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో ఎక్కువ మంది టైప్-2 రకానికి చెందిన వారే. 30 సంవత్సరాల వయసు దాటిన వారిలో సరైన అవగాహన లేకపోవడం, ఆహారపు అలవాట్లపై నియంత్రణ లేకపోవడం, శారీరక వ్యాయామానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతో జిల్లాలో ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా వైద్యాధి కారులు జిల్లాలో 7వేల మందికి పైగా షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 130కి పైగాకొత్త కేసులు వెలుగుచూశాయి. జంక్‌ఫుడ్, అధిక కొవ్వుఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడంతో పాటు శీతల పానీయాలు, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, స్వీట్లు అధికంగా తినడం, నిద్రలేమి వంటి కారణాలతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి మధుమేహం బారిన పడుతున్నారు. అలసటగా ఉండడం, అకారణంగా బరువు తగ్గడం, గాయాలు మానకపోవడం, తరుచూ మూత్రవిసర్జన చేయడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే షుగర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
బీపీ కేసులు ఇంకా ఎక్కువ..
జిల్లాలో మధుమేహం రోగులకంటే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు అధికంగా ఉన్నారు. ఈ నెల 10తో ముగిసిన ఎన్సీడీ 4.0 సర్వే ప్రకారం జిల్లాలో 1,81,485 మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ రోగులు కూడా ఏటా పెరుగుతూనే ఉన్నారు. తలతిరగడం, గుండె దడ, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి ఉన్నప్పుడు బీపీగా అనుమానించి పరీక్ష చేయంచుకోవాలి. కొందరిలో ఎటువంటి లక్షణాలు బయటకు కనిపించకపోయినా అధిక రక్తపోటు ఉండొచ్చు. దీనికి పరీక్ష చేయించుకోవడం ఒక్కటే పరిష్కారం. కానీ, సరైన అవగాహన కొరవడుతోంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు హైబీపీతో గుండె, మూత్రపిండాలు, మెదడు, నేత్రాలు వంటి అవయవాలపై ప్రభావం పడుతుంది. తొందరగా బీపీని గుర్తించి జీవనశైలిని మార్చుకొని డాక్టర్ల సూచనలతో మందులు వాడుతుంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించొచ్చు.
అవగాహన కార్యక్రమలు లేవు..
జిల్లాలో చక్కెర వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. వైద్యఆరోగ్యశాఖ తరపున ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు సర్వేలో పాల్గొని పరీక్షలు చేయడం తప్ప అవగాహన కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు. కొన్ని సందర్భాల్లో హడావుడి చేయడం తప్ప ఒక నిర్దిష్ట ప్రణాలికేదీ కనిపించదు. ఈ వ్యాధిపై ప్రజల్లో ఎంత అవగాహన పెరిగితే అంత వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వస్తారు. అవగాహనను విస్తృతం చేయకుండా టెస్ట్‌లు చేసినప్పుడల్లా కొత్తమధుమేహం కేసులు బయటపడుతూనే ఉంటాయి.