ఆశీలు దందా
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:16 AM
నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్డు మార్జిన్ ఆశీలు వసూళ్లలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
- విజయనగరంలో అడ్డగోలుగా వసూలు
- గగ్గోలు పెడుతున్న వ్యాపారులు
- పట్టించుకోని అధికారులు
విజయనగరం టౌన్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్డు మార్జిన్ ఆశీలు వసూళ్లలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు అతిక్రమించి సంబంధిత లీజుదారు డబ్బులను వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై కొంతమంది కార్పొరేటర్లు గళం విప్పారు. నగరంలోని రహదారి పక్కన కూరగాయలు, ఇతర సరుకులు విక్రయాలు చేపట్టే వారితో పాటు వాటిని తీసుకువచ్చే వాహనదారులు కూడా నగరపాలక సంస్థకు ఆశీల రూపంలో డబ్బులు చెల్లించాలి. దీనికి సంబంధించి అధికారులు ప్రతి ఏటా ఆశీల పాట నిర్వహిస్తారు. ఏయే వాహనం వద్ద ఎంతెంత వసూలు చేయాలో పట్టిక ద్వారా తెలియజేసి లీజుదారుకు అప్పగిస్తారు. ఆ పట్టికలో ఉన్న రేట్లు ప్రకారమే ఆశీలు వసూలు చేయాలి. కానీ, లీజుదారు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఉదాహరణకు నగరంలోకి ఇసుక, రాయి పిక్క, ఉట్టిగడ్డి, ఇటుక వంటివి తీసుకువచ్చే ట్రాక్టర్లు, లారీల నుంచి ఆశీల రూపంలో రూ.50 మాత్రమే వసూలు చెల్లించాలి. కానీ, రూ.100 పైగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కూరగాయలు, ఇతర సరుకులు అన్‌లోడింగ్ తరువాత మార్కెట్‌కు వచ్చే ఆటోలు, మినీ వ్యాన్‌ల నుంచి రూ.35 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.100 నుంచి 300 వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. తోపుడు బండ్లపై కొబ్బరి బొండాలు, మొక్కజొన్న పొత్తులు వంటివి విక్రయించే వారి నుంచి ఆశీల కింద రోజుకు రూ.10 మాత్రమే వసూలు చేయాలి. కానీ, రూ.15 నుంచి 30 వరకూ ముక్కుపించి వసూలు చేస్తున్నట్లు వారు గగ్గోలు పెడుతున్నారు. కొన్నిసార్లు రశీదులు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ విషయమై సహాయక కమిషనర్ కె.అప్పలరాజును వివరణ కోరగా ‘నగరపాలక సంస్థ ఇచ్చిన పట్టిక ప్రకారమే ఆశీలు వసూళ్లు చేయాలి. నిబంధనలకు అతిక్రమించి అధిక వసూళ్లకు పాల్పడితే లీజుదారుపై చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు.
రూ.300 తీసుకున్నారు
మొక్కజొన్న పొత్తులను ఆటోలో మార్కెట్‌కు తెచ్చాను. ఆశీలు కింద రూ.35 మాత్రమే వసూలు చేయాలి. కానీ, చిన్నయ్య అనే లీజుదారు నా నుంచి రూ.300 తీసుకున్నాడు. అధికంగా ఆశీలను వసూలు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
-రామునాయుడు, ఆటో డ్రైవర్.
రశీదు ఇవ్వడం లేదు
నేను కేఎల్‌పురం రహదారిపై తోపుడు బండిపై కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తుంటాను. ప్రతిరోజూ నా నుంచి రూ.15, అప్పుడప్పుడు రూ.20కు పైగా ఆశీలు వసూలు చేస్తున్నారు. రూ.10 ఇస్తే గొడవకు దిగుతున్నారు. ఒక్కొక్కసారి రశీదు కూడా ఇవ్వరు. స్థానిక కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
-కొండమ్మ, కొబ్బరి బొండాల వ్యాపారి, కేఎల్‌పురం