Share News

బైక్‌ కల్చర్‌.. తీస్తోంది ప్రాణం!

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:55 PM

Road accidents increasing in the srikakulam జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పల్లెల్లో సైతం ప్రతి ఇంటా ద్విచక్ర వాహన వినియోగం పెరిగింది. మైనర్లు సైతం బైక్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

బైక్‌ కల్చర్‌.. తీస్తోంది ప్రాణం!
ఇచ్ఛాపురంలో ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణం

  • జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

  • వాహనాలతో రోడ్డెక్కుతున్న మైనర్లు

  • తల్లిదండ్రులకు తప్పని విషాదాలు

  • ఇచ్ఛాపురం, జనవరి 5(ఆంధ్రజ్యోతి):

  • జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పల్లెల్లో సైతం ప్రతి ఇంటా ద్విచక్ర వాహన వినియోగం పెరిగింది. మైనర్లు సైతం బైక్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. హెల్మెట్‌ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, మైనర్లు వాహనాలు నడపడం వంటి కారణాలతో జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన మూడేళ్ల గణాంకాలు చూస్తే.. 2023లో 511 ప్రమాదాలు జరిగాయి. 156 మంది క్షతగాత్రులు కాగా 109 మంది మృతిచెందారు. 2024లో 654 ప్రమాదాలు జరగ్గా.. 216 మంది క్షతగాత్రులయ్యారు. 98 మంది మృతిచెందారు. 2025లో 300 వరకూ ప్రమాదాలు జరిగాయి. 174 మంది క్షతగాత్రులయ్యారు. 80 మంది వరకూ మృతిచెందారు. ద్విచక్ర వాహన ప్రమాదాలకు సంబంధించి ఎక్కువగా హెల్మెట్‌ ధరించకపోవడం.. మితిమీరిన వేగం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

  • స్పోర్ట్స్‌ బైకుల వినియోగం

  • చాలామంది తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టి సారించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ప్రమాదాలు జరిగి మూల్యం చెల్లించుకున్న తరువాత అయ్యో పాపం అని బాధపడుతున్నారు. సాధారణంగా ద్విచక్ర వాహనం ప్రతి ఇంటికి అవసరమే. కానీ పిల్లలు అడిగిందే తడవుగా స్పోర్ట్స్‌ బైక్‌లు, రేస్‌బైక్‌లు కొనిచ్చేస్తున్నారు. ఇలా బైక్‌లు సమకూర్చిన తరువాత చాలామంది పిల్లలపై దుష్ట్రభావం పడుతోంది. చెడు సావాసాలు పెరుగుతున్నాయి. చాలారకాల వ్యసనాలు తోడవుతున్నాయి. బైక్‌ రేసింగ్‌, మందు తాగి డ్రైవింగ్‌ చేయడం వంటి వాటితో వారు మూల్యం చెల్లించుకుంటున్నారు. సోషల్‌ మీడియా ప్రభావంతో ఎక్కువ మంది యువకులు బైక్‌ రైడింగ్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో కాలేజీలు విడిచిపెట్టే సమయంలో బైకులతో హోరెత్తిస్తున్నారు. వీటిపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • 2025లో ఎన్నో ప్రమాదాలు

  • జనవరి 19న ఇచ్ఛాపురం పట్టణ పరిధి సంతపేట వద్ద డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. హెల్మెట్‌ ధరించకపోవడంతో ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

  • నవంబరు 2న పొందూరు మండలానికి చెందిన తారకేశు అనే యువకుడు లారీ ఢీకొని మృతిచెందాడు. బైక్‌పై వెళుతుండగా చిలకపాలెం-రాజాం రోడ్డులో లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుర్రాడి వయసు 19 సంవత్సరాలు మాత్రమే.

  • నవంబరు 28న పలాస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. అతివేగంతో ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొట్టిన ఘటనలో భీమారావు, సుశాంత్‌కుమార్‌ పైకా అనే యవకులు దుర్మరణం చెందారు. వారిద్దరికీ 25 సంవత్సరాల వయసే. ఇలా ఏడాది వ్యవధిలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

  • మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

  • మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదు. ఇటీవల సోషల్‌ మీడియా ప్రభావంతో ఎక్కువ మంది పిల్లలు బైక్‌ రైడింగ్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. అందువల్లే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మైనర్లు డ్రైవింగ్‌, ట్రిబుల్‌ డ్రైవింగ్‌ను అరికడతాం. బస్టాండ్‌ జంక్షన్‌ వద్ద పోలీస్‌ గస్తీ ఏర్పాటు చేస్తాం.

    - మీసాల చిన్నమనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం

Updated Date - Jan 05 , 2026 | 11:55 PM