Share News

విద్యాశాఖలో విభజన

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:59 PM

Headmasters as Zonal Cadre Posts విభజిత జిల్లాలకు టీచింగ్‌ పోస్టుల కేటాయింపులో కదలిక ప్రారంభమైంది. ఇప్పటికే విద్యాశాఖలో బోధనేతర పోస్టులకు సంబంధించి అధికారులు, సిబ్బంది జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌, రాష్ట్రస్థాయి కేడర్‌ పోస్టుల వర్గీకరణ పూర్తయింది. తాజాగా బోధన సిబ్బంది అయిన టీచర్లు ప్రాథమిక పాఠశాలలు, హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీగ్రేడ్‌, ఇతర జిల్లా, జోనల్‌స్థాయి పోస్టులుగా ప్రభుత్వం వర్గీకరించింది.

విద్యాశాఖలో విభజన

  • జోనల్‌ కేడర్‌ పోస్టులుగా హెచ్‌ఎంలు

  • ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లకు జిల్లా కేడర్‌

  • ప్రభుత్వ, జడ్పీ యాజమాన్యాలకు వేర్వేరుగా ఉత్తర్వులు

  • డీఈవో కార్యాలయంలో ఏపీవో, ఏఎస్‌వో పోస్టులు ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులతో భర్తీ

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): విభజిత జిల్లాలకు టీచింగ్‌ పోస్టుల కేటాయింపులో కదలిక ప్రారంభమైంది. ఇప్పటికే విద్యాశాఖలో బోధనేతర పోస్టులకు సంబంధించి అధికారులు, సిబ్బంది జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌, రాష్ట్రస్థాయి కేడర్‌ పోస్టుల వర్గీకరణ పూర్తయింది. తాజాగా బోధన సిబ్బంది అయిన టీచర్లు ప్రాథమిక పాఠశాలలు, హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీగ్రేడ్‌, ఇతర జిల్లా, జోనల్‌స్థాయి పోస్టులుగా ప్రభుత్వం వర్గీకరించింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్‌ యాజమాన్యాల్లోని టీచింగ్‌ పోస్టులకు కేడర్‌ నిర్ధారిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. వాటిలో మునిసిపల్‌ యాజమాన్యంలో టీచింగ్‌ పోస్టుల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదు.

  • రెండు కేడర్లుగా వర్గీకరణ

  • విద్యాశాఖలో ప్రభుత్వ, జిల్లాపరిషత్‌ యాజమాన్యాల్లోని టీచింగ్‌ పోస్టులను రెండు కేడర్లుగా వర్గీకరించారు. స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీగ్రేడ్‌, తత్సమాన టీచర్‌ పోస్టులన్నింటినీ రెండు యజమాన్యాల్లో స్థానిక(జిల్లా) పోస్టులుగా గుర్తించారు. వీటిని జిల్లా విద్యాశాఖాధికారి భర్తీ చేస్తారు. ప్రభుత్వ, జడ్పీ హైస్కూళ్లలో హెచ్‌ఎం పోస్టులను జోనల్‌ కేడర్‌గా గుర్తించారు. ఈ పోస్టులను జోనల్‌ సీనియారిటీ ప్రాతిపదికన పాఠశాల విద్యప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్‌(ఆర్‌జేడీ) భర్తీ చేస్తారు.

  • జిల్లాపరిషత్‌ యాజమాన్యంలో 23 రకాల టీచర్‌ పోస్టులు, ప్రభుత్వ యాజమాన్యంలో 27 రకాల పోస్టులు జిల్లా కేడర్‌గా గుర్తించారు. డీఈవో కార్యాలయంలో ఏఎస్‌వో, ఏపీవో పోస్టులకు ఇక నుంచి కేవలం ప్రభుత్వ యాజమాన్యంలోని వారితోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో 95శాతం స్థానికులకే కేటాయించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

  • జిల్లాలో 11,858 మంది ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో ప్రభుత్వ యాజమాన్యంలో 576 మంది ఉన్నారు. ఎంపీపీ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 9,821 మంది, మునిసిపల్‌ పాఠశాలల్లో 463 మంది పనిచేస్తున్నారు. విభజిత జిల్లాలకు ఉపాధ్యాయులను సీనియార్టీ ప్రాతిపదికనే కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేకంగా సీనియారిటీ జాబితాలను తయారు చేయాలని ప్రభుత్వం డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

  • జిల్లాకు రానున్న పోస్టులు ఇవే

  • జిల్లాలో మొత్తం 11,858 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు 80.23శాతం, పార్వతీపురం మన్యం జిల్లాకు 8.96 శాతం, విజయనగరం జిల్లాకు 9.81శాతం ఉపాధ్యాయులను కేటాయించారు. ఉపాధ్యాయుల విభజన అనంతరం హిందీ -591 పోస్టులు, తెలుగు -594, ఇంగ్లీషు -645, గణితం -600, భౌతికశాస్త్రం -444, బయాలజీ-455, సాంఘీకశాస్త్రం- 536, ఫిజకల్‌ డైరెక్టర్లు -343, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (తెలుగు)-4-23, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఒరియా)-228 పోస్టులు కేటాయించనున్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:59 PM