Share News

ఊరికి వీడ్కోలు

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:52 PM

Mulapeta emptying out due to port construction పోర్టు నిర్మాణంలో భాగంగా.. అధికారులు మూలపేట గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇళ్లను యంత్రాలతో కూల్చేసి.. గ్రామస్థులను నౌపడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరతరాలుగా ఆ ఊరితో ఉన్న అనుబంధానికి గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

ఊరికి వీడ్కోలు
మూలపేట గ్రామం.. నౌపడలోని పునరావస కాలనీకి తరలిస్తున్న సామగ్రి

  • పోర్టు నిర్మాణంతో ఖాళీ అవుతున్న మూలపేట

  • ఇళ్లను తొలగిస్తున్న అధికారులు

  • జ్ఞాపకాలు మూటగట్టుకుని వెళ్తున్న గ్రామస్థులు

  • నౌపడలోని పునరావాస కాలనీకి పయనం

  • సంతబొమ్మాళి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మూలపేట.. ఒకప్పుడు ఆ ఊరంతా సందడిగా ఉండేది. సంతబొమ్మాళి మండలంలోని ఈ గ్రామంలో ఓవైపు తంపర భూములు.. మరోవైపు తీరప్రాంతం.. ఇంకోవైపు రొయ్యల చెరువుల సాగు.. సముద్ర దిబ్బలపై జీడితోటలు.. ఎటు చూసినా ఆహ్లాదంగా కనిపించేది. రైతులు, మత్స్యకారులు, తదితర వర్గాల ప్రజలు ప్రకృతితో మమేకమవుతూ.. స్థానికంగా జీవనోపాధి సాగించేవారు. చేపలవేట, రొయ్యలచెరువు సాగు, జీడిపిక్కలు ఏరడం, వరికోతలు ముగిసిన వెంటనే.. ఉప్పు పంటకు సిద్ధమయ్యేవారు. కాగా.. ప్రస్తుతం పోర్టు నిర్మాణంలో భాగంగా.. అధికారులు ఈ గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇళ్లను యంత్రాలతో కూల్చేసి.. గ్రామస్థులను నౌపడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరతరాలుగా ఆ ఊరితో ఉన్న అనుబంధానికి గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇళ్లు, దేవాలయాలు, చెట్లు, పొలాలు, బాల్య జ్ఞాపకాలను వదిలి వెళ్లాల్సి రావడంతో గ్రామంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా నివసించిన గ్రామస్థులు.. తమ ఇంటిముందు నిలబడి చివరిసారిగా జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. పునరావాసం వైపు అడుగులేస్తున్నారు. ఏడాదంతా స్థానికంగా ఉపాధి లభించేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఊరిని ఖాళీ చేయాల్సి వస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కాగా.. ఊరిని ఖాళీ చేసినా.. ‘పోర్టు’ రూపంలో తమ గ్రామం పేరు మార్మోగుతుందని.. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పునరావాసకాలనీలో తమకు ఇబ్బందులు లేకుండా ఉపాధి కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

  • ఇళ్లు తొలగింపు..

  • మూలపేటలో 355 ఇళ్లు ఉన్నాయి. పదిరోజుల కిందట ఇళ్లు ఖాళీ చేసి.. సామగ్రితో పునరావాస కేంద్రానికి వెళ్లిపోవాలని అధికారులు దండోరా వేయించారు. దీంతో కొంతమంది నిర్వాసితులు స్వచ్ఛందంగా తరలివెళ్లి నౌపడలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. మరికొందరు పునరావాసకాలనీలో చిన్నషెడ్‌లు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఇప్పటికే ఖాళీ చేసిన కొన్ని ఇళ్లను అధికారులు కూల్చేశారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేవని.. శ్రావణమాసంలో గ్రామం మొత్తం ఖాళీ చేస్తామని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవాలయాల్లో విగ్రహాలను కూడా అప్పుడే తొలస్తామని చెబుతున్నారు. ఈనేపథ్యంలో నెలాఖరులోగా గ్రామం మొత్తం ఖాళీ చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

  • పోర్టు నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్థులకు నౌపడలో పునరావస కాలనీలో 58 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు గ్రామాల్లో 594 కుటుంబాలను ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలు (పీడీఎఫ్‌)లుగా గుర్తించారు. 15 నెలలు కిందటే విష్ణుచక్రం గ్రామస్థులు ఊరిని ఖాళీ చేశారు. పునరావస కాలనీలో 81 ప్లాట్లు కేటాయించగా కొందరు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేశారు. తాజాగా మూలపేట గ్రామస్థులకు లాటరీ ద్వారా 511 మందికి 91 క్లస్టర్లుగా విభజించి ప్లాట్లు కేటాయించారు.

  • ఇక జ్ఞాపకాలే..

  • మూలపేట గ్రామస్థులకు భక్తిభావం ఎక్కువ. అమ్మవారి పండుగలు ఘనంగా నిర్వహించేవారు. పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు చేసేవారు. రూ.లక్షలు వెచ్చించి శివాలయాన్ని నిర్మించారు. కార్తీకమాసంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండేవారు. పూజలు, భజనలతో ఎంతో సందడిగా ఉండేది. పిల్లల కేరింతలతో కళకళలాడేది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని ఖాళీ చేయిస్తుండడంతో వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గ్రామంలో దేవాలయాలు, చెరువులు, చెట్లు, పూర్వీకుల సమాధులు గ్రామస్థులకు జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి.

  • గుండె తరుక్కుపోతోంది

  • మా తాతల కాలం నుంచీ ఈ ఊరిలోనే జీవనం సాగిస్తున్నాం. మూలపేటలో గత యాభై ఏళ్లుగా గ్రామ పెద్దలు, ప్రజలు ఐకమత్యంతో సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నాం. ఇప్పుడు గ్రామం ఖాళీ చేసి వెళ్లాలంటే గుండె తరుక్కుపోతోంది.

  • - కోట నారంనాయుడు, మూలపేట

  • గ్రామంలోనే ఉపాధి

  • మూలపేటలో ఏడాదంతా ఉపాధి అభించేది. గ్రామం చుట్టూ ఉన్న తంపరలో చేపలవేట సాగిస్తూ జీవనోపాధి పొందేవాళ్లం. వేసవిలో జీడితోటల్లో జీడిపిక్కలు, ఉప్పు మడుల్లో పనులతోపాటు రొయ్యల సాగులో ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించేది.

  • - జీరు తాతన్న, మూలపేట

  • గ్రామమంతా సందడిగా ఉండేది.

  • ఏ పండుగ వచ్చినా మా గ్రామమంతా సందడిగా ఉండేది. అమ్మవారి పండుగ జరుపుకొనేటప్పుడు వేలాది మంది గ్రామానికి వచ్చేవారు. కార్తీక మాసమంతా శివాలయం వద్ద భక్తులతో సందడిగా ఉండేది. గ్రామాన్ని ఖాళీ చేయడమంటే ఎంతో బాధగా ఉంది.

  • సుగ్గు సింహాచలం, మూలపేట

  • పునరావాసానికి తరలిస్తున్నాం

  • పోర్టు నిర్మాణంలో భాగంగా మూలపేట గ్రామాన్ని నౌపడలోని పునరావస కాలనీకి తరలిస్తున్నాం. ఇప్పటికే వారికి లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయంచాం. ఇప్పటివరకు 50 మందికి పైగా నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసి పునరావస కేంద్రానికి వెళ్లిపోయారు. ఆ ఇళ్లు తొలగిస్తున్నాం. ప్రస్తుతం ముహూర్తాలు లేవని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. నెలాఖరు నాటికి గ్రామం మొత్తం ఖాళీ చేయిస్తాం.

  • బి.హేమసుందరరావు, తహసీల్దార్‌, సంతబొమ్మాళి

Updated Date - Aug 10 , 2026 | 11:52 PM