సిక్కోలుకు ‘భోగాపురం’ ప్రగతి
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:47 AM
Airport to be inaugurated by Prime Minister Modi today ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే భారీ ప్రాజెక్టు ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును శనివారం లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. భౌగోళికంగా ఈ ఎయిర్ పోర్టు విజయనగరం జిల్లాలో ఏర్పాటైనప్పటికీ.. దీనివల్ల అత్యధికంగా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందేది మాత్రం మన జిల్లానే అని చెప్పవచ్చు. సిక్కోలు ప్రగతి రథచక్రాలకు.. ఈ విమానాశ్రయం సరికొత్త వేగం అందించనుంది. జిల్లాను పారిశ్రామికంగా, పర్యాటకంగా పరుగులు పెట్టించనుంది.
నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
విజయనగరం జిల్లాలో ఉన్నా.. శ్రీకాకుళానికే సింహభాగం ప్రయోజనాలు
లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి
పలాస జీడి, మత్స్య సంపద ఎగుమతులకు మహర్దశ
ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలెన్నో
శ్రీకాకుళం, జూలై 31(ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే భారీ ప్రాజెక్టు ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును శనివారం లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. భౌగోళికంగా ఈ ఎయిర్ పోర్టు విజయనగరం జిల్లాలో ఏర్పాటైనప్పటికీ.. దీనివల్ల అత్యధికంగా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందేది మాత్రం మన జిల్లానే అని చెప్పవచ్చు. సిక్కోలు ప్రగతి రథచక్రాలకు.. ఈ విమానాశ్రయం సరికొత్త వేగం అందించనుంది. జిల్లాను పారిశ్రామికంగా, పర్యాటకంగా పరుగులు పెట్టించనుంది.
సముద్రం, ఆకాశం.. ఒకేసారి...!
జిల్లాలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు, భోగాపురం ఎయిర్ పోర్టుకు మధ్య జరగనున్న అనుసంధానం జిల్లా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనుంది. మూలపేట పోర్టు నుంచి భోగాపురం వరకు ప్రతిపాదించిన ఆరులేన్ల హైవే నిర్మాణంతో కనెక్టివిటీ అమాంతం పెరగనుంది. ఒకపక్క మూలపేట పోర్టు ద్వారా జల రవాణా, మరోపక్క భోగాపురం ద్వారా వాయు రవాణా... సౌకర్యాలు ఒకేసారి అందుబాటులోకి వస్తుండటంతో జిల్లా అతిపెద్ద లాజిస్టిక్ హబ్‌గా మారే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయం.. రణస్థలం నుంచి కూతవేటు దూరంలోనే ఉంటుంది. విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే జిల్లా వాసులు గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. రణస్థలం, పైడిభీమవరం పారిశ్రామిక వాడలకు ఇది అత్యంత సమీపంలో ఉండటం వల్ల జిల్లాకు పారిశ్రామికంగా పెద్ద బూస్ట్ రానుంది.
జీడి పరిశ్రమకు గ్లోబల్ మార్కెట్...
దశాబ్దాలుగా మన పలాస జీడి.. రోడ్డు, రైలు మార్గాల ద్వారానే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఇప్పుడు భోగాపురంలో సుమారు 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల భారీ ఎయిర్ కార్గో సదుపాయం అందుబాటులోకి వస్తుండటంతో... పలాస జీడికి అంతర్జాతీయ మార్కెట్ గేట్లు తెరుచుకున్నట్లే. తాజా ప్యాకింగ్‌తో కొన్ని గంటల్లోనే గల్ఫ్, యూరప్, అమెరికా దేశాలకు నేరుగా ఎగుమతి చేసే అవకాశం ఏర్పడుతుంది. దీంతో స్థానిక రైతులు, ప్రాసెసింగ్ వ్యాపారుల ఆదాయం రెట్టింపు అవ్వడమే కాకుండా.. ఈ అనుబంధ రంగాల్లో వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది. జీడితోపాటు ఉద్దానం కొబ్బరి, తీరప్రాంత మత్స్య సంపద, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ఎయిర్‌కార్గో ఎంతో ఉపయోగపడనుంది.
మారనున్న యువత తలరాత...
ఎయిర్ పోర్టు కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాగానే.. ఏవియేషన్, కార్గో, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. విమానాశ్రయం శ్రీకాకుళం వాసులకు అందుబాటులో ఉండటంతో మన యువతకు ప్రత్యక్షంగా ఎన్నో అవకాశాలు దక్కుతాయి. పరోక్షంగా.. క్యాబ్ సర్వీసులు, ట్రావెల్ ఏజెన్సీలు, హోటళ్లు, టూరిజం గైడ్లు, చిన్న తరహా వ్యాపారాల ద్వారా జిల్లాలోని ఎన్నో వేల కుటుంబాలకు స్థానికంగానే జీవనోపాధి లభిస్తుంది.
పర్యాటకానికి కొత్త ఊపు...
భోగాపురం విమానాశ్రయం జిల్లా పర్యాటక రంగానికి జవసత్వాలు అందించనుంది. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం తదితర ప్రసిద్ధ ఆలయాలతోపాటు శాలిహుండం బౌద్ధ స్థూపాలు, కళింగపట్నం, బారువ బీచ్‌ల అందాలను వీక్షించేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సులభంగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, విదేశాల్లో స్థిరపడిన సిక్కోలు ప్రవాస భారతీయులు స్వగ్రామాలకు రాకపోకలు సాగించేందుకు విశాఖ కంటే భోగాపురం చాలా దగ్గరవుతోంది.
భవిష్యత్ ప్రయోజనాలు ఇవే...
భోగాపురం-మూలపేట కారిడార్ చుట్టుపక్కల భూముల విలువ అమాంతం పెరిగి రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది.
రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో ఐటీ, ఫార్మా, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీలు శ్రీకాకుళం వైపు క్యూ కడతాయి. టెక్కలి, పలాస, రణస్థలం ప్రాంతాలు సరికొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్లుగా మారతాయి.
అంతర్జాతీయ కనెక్టివిటీ కారణంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రముఖ విద్యాసంస్థలు జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయి. భవిష్యత్‌లో వలసలను నివారించి, ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించే అభివృద్ధి కేంద్రంగా సిక్కోలు మారడానికి ఈ ప్రాజెక్టు నాంది పలకనుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎయిర్‌పోర్టు నుంచి ‘మూలపేట’కు మార్గం : మంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి, జూలై 31(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు వరకు త్వరలో ఆరులేన్ల రహదారి ఏర్పాటు చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ‘ఆరులేన్ల రహదారి నిర్మిస్తే.. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. పలువురు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 2029 నాటికి టెక్కలి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా. వైసీపీ పాలనలో గొడ్డలిపార్టీ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ప్రస్తుత కూటమి పాలనలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలి. పార్టీ కోసం కష్టపడాలి’ అని మంత్రి అచ్చెన్న సూచించారు.
చలో భోగాపురం
‘భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ శనివారం రానున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పండగ వాతావరణంలో ఉత్సాహంగా భోగాపురం బయలుదేరాల’ని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మోదీ సభకు వచ్చిన వారికి అవసరమైన బస్సుల సౌకర్యం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మజ్జిగ, వాటర్ బాటిల్స్ వంటివి సిద్ధం చేశామని తెలిపారు. భోగాపురంలో ఎయిర్‌పోర్టు ప్రారంభాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో ర్యాలీలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.