భోగాపురం.. తగ్గనున్న భారం
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:06 AM
Easy travel with the new airport భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లాలో చాలామందికి ఉపశమనం కలగనుంది. ప్రయాణ దూరాభారం తగ్గనుంది. ఆపై ప్రయాణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.
జిల్లా నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే వ్యయప్రయాసలు
కొత్త విమానాశ్రయంతో సులువుగా ప్రయాణం
నేరుగా అన్ని దేశాలకు విమానాలు
ఉద్దానంలో వలస కార్మికులకు ఊరట
ఇచ్ఛాపురం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి):
ఇచ్ఛాపురం మండలం జగన్నాథపురానికి చెందిన రాజు దుబాయ్‌లో ఉంటున్నారు. ఏటా సుమారు నెలరోజులపాటు సెలవులకు స్వగ్రామానికి వస్తుంటారు. ఆ సమయంలో విశాఖకు నేరుగా విమానాలు ఉండవు. హైదరాబాద్‌లో దిగి రైలును ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో దాదాపు ఒకరోజు సమయం పట్టేది. ప్రస్తుతం జిల్లాకు చేరువలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో నేరుగా చేరుకోవచ్చని రాజు పేర్కొంటున్నారు.
ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన రాజయ్య సింగపూర్‌లో వలస కూలీగా ఉన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సెలవులకు వచ్చేవాడు. ఈ క్రమంలో విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయన కోసం ఇచ్ఛాపురం నుంచి కారును ముందస్తుగా బుక్ చేసుకునేవారు. దానికి దాదాపు రూ.7వేలు కిరాయి ఉండేది. ప్రస్తుతం భోగాపురంలో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడంతో 50 కిలోమీటర్ల దూరం తగ్గింది. సుమారు రూ.3వేల ప్రయాణ భారం తగ్గనుందని రాజయ్య చెబుతున్నారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లాలో చాలామందికి ఉపశమనం కలగనుంది. ప్రయాణ దూరాభారం తగ్గనుంది. ఆపై ప్రయాణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో వలస కూలీలు అధికం. ముఖ్యంగా ఉద్దానం యువత ఎక్కువగా విదేశాల్లో భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు. వీరికి విమాన ప్రయాణం తప్పనిసరి. అందుకే ఈ గ్రామాల్లో యువత.. వయసు అర్హత సాధించగానే తప్పకుండా పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో 11 మండలాల్లో సుమారు 10 వేల మంది యువకులు దుబాయ్, అబుదాబి, సింగపూర్, సౌదీ అరేబియా, కతర్ వంటి గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా పని చేస్తున్నారు. వీరు రాకపోకలు సాగించేందుకు ఎక్కువగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టుపై ఆధారపడేవారు. కొందరు విశాఖకు నేరుగా విమానాలు లేక కనెక్టింగ్ ఫ్లైట్లపై ఆధారపడేవారు. మరికొందరు హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో స్వస్థలాలకు చేరుకునేవారు. అలాగే ఆస్ర్టేలియా వంటి దేశాలకు వెళ్లేవారు కూడా నేరుగా విశాఖ నుంచి విమానాలు లేక ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం జిల్లా ముఖద్వారానికి చెంతనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో వీరికి ప్రయాణ భారం తగ్గనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో అన్ని దేశాలకు కనెక్టివిటీ విమానాలు ఇక్కడి నుంచి ఉంటాయి. దీంతో విదేశీ ప్రయాణం మరింత సులువు కానుంది.
గతంలో ఎన్నో ఇబ్బందులు..
ఇచ్ఛాపురం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు. దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ విశాఖ విమానాశ్రయానికి చేరుకోలేరు. అది కూడా రైళ్లలో వెళితే కుదిరే పనికాదు. అందుకే ఎక్కువ మంది క్యాబులు, అద్దె కార్లను ఆశ్రయిస్తుండేవారు. దీంతో ఇచ్ఛాపురం నుంచి విశాఖకు వెళ్లేవారు కనీసం రూ.10 వేలు ఖర్చుపెట్టాల్సి వచ్చేది. పలాస ప్రాంతీయులకు రూ.7వేల వరకూ ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం భోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో జిల్లావాసులకు ఆ దూరం 50 నుంచి 70 కిలోమీటర్ల తగ్గింది. పైగా విశాఖలో ట్రాఫిక్ కారణాల దృష్ట్యా అధిక సమయం పడుతూ.. ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం జాతీయ రహదారి గుండా నేరుగా భోగాపురం చేరుకునే అవకాశం ఉండడంతో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశమే లేదు. కాగా ఇచ్ఛాపురం నుంచి ప్రతిరోజూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు. విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ చొరవ తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.