జడ్పీ చైర్‌పర్సన్‌గా భవానీ
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:05 AM
The ZP chairperson post goes to Jana Sena జడ్పీ పీఠం జనసేనకే దక్కింది. శుక్రవారం జడ్పీ వేదికగా జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నిక జరిగింది. జడ్పీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ కొరికాన భవానీ (జనసేన)కి జై కొట్టారు. వైస్ చైర్మన్‌గా వజ్రపుకొత్తూరు జడ్పీటీసీ సభ్యుడు గుంటు విజయ్‌కుమార్ (టీడీపీ)ను ఎన్నుకున్నారు.
వైస్‌చైర్మన్‌గా గుంటు విజయ్‌కుమార్
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అభినందనలు
శ్రీకాకుళం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జడ్పీ పీఠం జనసేనకే దక్కింది. శుక్రవారం జడ్పీ వేదికగా జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నిక జరిగింది. జడ్పీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ కొరికాన భవానీ (జనసేన)కి జై కొట్టారు. వైస్ చైర్మన్‌గా వజ్రపుకొత్తూరు జడ్పీటీసీ సభ్యుడు గుంటు విజయ్‌కుమార్ (టీడీపీ)ను ఎన్నుకున్నారు. జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లాలోని 30 మంది జడ్పీటీసీ సభ్యులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రమాణం చేయించారు. టీడీపీ నుంచి గెలుపొందిన 22 మంది జడ్పీటీసీలు, జనసేన నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఇద్దరు, వైసీపీ నుంచి ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పరోక్ష ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. జడ్పీచైర్‌పర్సన్ పదవికి కొరికాన భవానీ పేరును హిరమండలం, ఆమదాలవలస జడ్పీటీసీ సభ్యులు సిరిపురం త్రివేణి, తమ్మినేని సుజాత ప్రతిపాదించారు. జనసేన పార్టీ తరఫున బీ-ఫారం అందడం, ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ ప్రకటించారు. వైస్ చైర్మన్ పదవికి గుంటు విజయ్‌కుమార్ పేరును ఎచ్చెర్ల, కోటబొమ్మాళి జడ్పీటీసీలు విశ్వక్‌సేన్ సయ్యద్, పూజారి శైలజ ప్రతిపాదించగా.. టీడీపీ బీ-ఫారం అందడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి.. తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జడ్పీచైర్‌పర్సన్ భవానీ, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌ను అభినందించారు.
రెండుసార్లు ప్రమాణ స్వీకారం
జడ్పీ చైర్‌పర్సన్‌గా కొరికాన భవానీ వేదికపై నుంచి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. అయితే జడ్పీటీసీ మాదిరిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గుర్తించి... జడ్పీటీసీ అని సంబోధించకుండా.. జడ్పీ చైర్‌పర్సన్ అని ప్రమాణస్వీకార పత్రంలో చదవాలని చెప్పారు. దీంతో అధికారులు వెంటనే ప్రమాణస్వీకార పత్రాన్ని సరిచేసి.. మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ ఉద్యోగులు కొత్త పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. సమావేశంలో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, జడ్పీ సీఈవో వెంకటరామన్, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.తేజేశ్వరరావు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరిస్తా
‘జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ.. మండలాల్లోనూ సమస్యలను తెలుసుకుంటాను. ప్రజలకు ఎళ్లవేలలా అందుబాటులో ఉంటాన’ని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కొరికాన భవానీ పేర్కొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ‘జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటా. వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్చ.. తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం.. ఇలా సమగ్ర నిర్ణయం తీసుకుంటా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్.. నాపై నమ్మకం ఉంచి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ బాధ్యతలను అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని.. జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాను. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సూచనలు తీసుకుంటా’ అని జడ్పీ చైర్‌పర్సన్ భవానీ తెలిపారు.