పిల్లలూ జాగ్రత్త
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:51 PM
Be vigilant during summer holidays వేసవి సెలవుల వేళ పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో జరిగిన సంఘటన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు.
వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే
సరదా మాటున పొంచిఉన్న ప్రమాదాలు
తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి
నరసన్నపేట, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి):
గతేడాది వేసవి సెలవుల్లో మే 26న.. కంచిలి మండలం సామంతపుట్టుగలో గ్రామదేవత ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ అలకంరణకు వినియోగించిన వైరు తగిలి 12 ఏళ్ల బాలిక బాడపల్లి నందిని మృతి చెందింది. ఆ బాలికను కాపాడబోయి.. చిల్ల ఈశ్వర్, మరో నాలుగేళ్ల బాలుడు నోళియా కృష్ణ కూడా ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది మే 7న రణస్థలం మండలం అర్జునవలసలో పదోతరగతి చదువుచున్న వడ్డాది గౌతమ్‌రాజ్‌కుమార్.. స్నేహితుడు దుర్గాప్రసాద్‌తో కలిసి గ్రామ శివారులో బావి వద్దకు స్నానం కోసం వెళ్లారు. బావిలో దిగిన కొద్ది సమయంలోనే గౌతమ్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వేసవి సెలవుల్లో నాన్నమ్మ సామాలమ్మ ఇంటికి.. తండ్రి లక్ష్మణరావుతో కలిసి వచ్చి.. ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లల్లో ఒకటే సందడి. అప్పటివరకూ చదువులు.. పరీక్షలతో ఒత్తిడిగా భావించే చిన్నారులు.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. మరికొందరు తల్లిదండ్రులతో కలిసి పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. కాగా వేసవి సెలవుల వేళ పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో జరిగిన సంఘటన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు 3.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాకు చెందిన సుమారు పదివేల మంది విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పదో తరగతి, ఇంటర్ విద్యనభ్యసిస్తున్నారు. పరీక్షలు ముగియడం.. ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇచ్చేయడంతో వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇప్పటికే ఇంకొంతమంది బంధువుల గ్రామాలకు పయనమయ్యారు. కాగా.. ఆటవిడుపు కోసం చాలామంది పిల్లలు కాలువలు, చెరువుల వద్దకు వెళ్తారు. ఇంకొందరు జలాశయాలు, నదులు వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు ఇష్టపడుతుంటారు. మరికొందరు ద్విచక్రవాహనాలు తీస్తూ చక్కెర్లు కొడతారు. ఇటువంటి వారిపై తల్లిదండ్రులు, బంధువులు ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే సరదా మాటున ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంది. గతంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈత రాకుండా నీటిలో దిగడం వల్ల జరిగే ప్రమాదాలపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. లోతైన చెరువులు, నేలబావులు వద్దకు ఈతకు వెళ్లరాదు. ప్రమాదాల గురించి తెలియజేయాలి. దిచక్రవాహనాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ మైనర్లకు ఇవ్వరాదు. డ్రైవింగ్ నేర్పిస్తే విశాలమైన మైదానంలో అనుభవజ్ఞుల పర్యవేక్షణలో నేర్పించాలి. ఇలా చేస్తే కొంతవరకైనా ప్రమాదాలు తగ్గించవచ్చు.
జాగ్రత్తలు తీసుకోవాలి
సెలవుల్లో సరదా కోసం చెరువులు, నదుల వద్దకు వెళ్లి.. మునిగిపోయి ప్రమాదాల బారిన పడే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్రవాహనాలు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వరాదు.
- మరడాన శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట సర్కిల్
పిల్లలపై దృష్టి
వేసవి సెలవుల్లో పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. చెరువులు, కాలువల వద్దకు తీసుకువెళ్లకపోవడం మంచిది. నదితీర ప్రాంతాలకు వెళ్లనీయరాదు. ద్విచక్రవాహనాలు నడిపేందుకు ఇవ్వరాదు. పిల్లలు వెంట ఉంటూ తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలి. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచడం మచింది. సృజనాత్మకత పెంచేలా ఇంటి వద్ద బొమ్మలు, నీతికథలు, పుస్తకపఠనంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలి.
- రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం