బాధితులకు మెరుగైన వైద్యం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:33 AM
Measures to prevent diarrhea శ్రీకాకుళంలో డయేరియా నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపట్టారు. డయేరియా ప్రబలిన మంగువారితోట, కాకివీధి, దమ్మలవీధి, గోల్కొండరేవు రోడ్ ప్రాంతాల్లో 50 ప్రత్యేక బృందాలతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
డయేరియా నివారణకు పూర్తిస్థాయి చర్యలు
ఇంటివద్ద వైద్యసహాయం అందిస్తున్న సిబ్బంది
అరసవల్లి/అర్బన్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో డయేరియా నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపట్టారు. డయేరియా ప్రబలిన మంగువారితోట, కాకివీధి, దమ్మలవీధి, గోల్కొండరేవు రోడ్ ప్రాంతాల్లో 50 ప్రత్యేక బృందాలతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటా వివరాలు సేకరించి.. చిన్నపాటి లక్షణాలు ఉన్నా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. శ్రీకాకుళంలోని 38, 39, 41 డివిజన్లకు చెందిన పలువురు డయేరియా బాధితులు కిమ్స్, జెమ్స్, రిమ్స్, మెడికవర్, శశిధర్ తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇప్పటికే చాలామంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరికొంతమందికి ఇంటివద్దే వైద్యసిబ్బంది సేవలు అందిస్తున్నారు. అలాగే డయేరియా బాధితుల కోసం ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పనులు చేపడుతున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర అధికారులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు.
20 బృందాలతో నీటి నమూనాల సేకరణ..
శ్రీకాకుళంలో 10 మంది సభ్యుల గల 20 బృందాలతో గత నాలుగు రోజులుగా నీటి నమూనాలను సేకరిస్తున్నారు. దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, గుడివీధికి సంబంధించి 5662 గృహాలు ఉన్నాయి. ఇందులో 2152 మందికి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. వీరి దగ్గర నుంచి నీటి నమూనాలను సేకరించి విశాఖపట్నంలోని ల్యాబ్‌కు పరీక్షలకు పంపిస్తున్నారు. వీటి నివేదిక వచ్చిన వెంటనే కారణాలను విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
నీటినమూనా సేకరణ
---------------
తేదీ సంఖ్య
23న 8
24న 37
25న 412
26న 800
మిగలిన వారి సంగతేంటి?
డయేరియా తీవ్రరూపం దాల్చేందుకు నగరపాలక సంస్థ శానిటేషన్, ఇంజినీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రతి దినం నీటి నాణ్యతను ప్రతీ వార్డులో పరిశీలించాల్సి ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మురుగునీటి కాలువలకు ఆనుకుని, మంచినీరు సరఫరా చేసే పైపులైన్లను వేయడం, కాలువల మరమ్మతుల సమయంలో తవ్వేసి.. పైపుల లీకేజీలను సరిగ్గా సరిచేయకపోవడంతో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాప్తికి దారితీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కూర్మారావును బాధ్యుడిని చేస్తూ సస్సెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజినీరింగ్, మునిసిపల్ ఆరోగ్య సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.