Share News

అప్రమత్తతే కిడ్నీకి రక్ష

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:00 AM

మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైనవి. శరీరంలో ఉన్న మలినాలను వడపోసి రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

అప్రమత్తతే కిడ్నీకి రక్ష
పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం

- ప్రజల జీవన శైలి మారాలి

- ముందస్తుగా గుర్తిస్తే వ్యాధి నయం

- అవగాహన కల్పిస్తున్న అధికారులు

- సత్ఫలితాలు ఇస్తున్న పరిశోధనలు

- పలాస ఆస్పత్రిలో మార్పిడి శస్త్రచికిత్స

- బాధితులకు అండగా ప్రభుత్వం

- నేడు వరల్డ్‌ కిడ్నీ డే

మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైనవి. శరీరంలో ఉన్న మలినాలను వడపోసి రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు తమ జీవన శైలి మార్చుకోవాలంటున్నారు. సురక్షితమైన నీటిని తాగడం, వ్యాయామం చేయడం, పోషక విలువల గల ఆహారం తీసుకోవడం, వ్యాధి రాకముందే తగిన పరీక్షలు చేసుకోవడం, చిన్న లక్షణాలు ఉన్నప్పుడే మందులు వినియోగించడం చేస్తే వ్యాధిని నయం చేయవచ్చునని అంటున్నారు. గురువారం వరల్డ్‌ కిడ్నీ డే సందర్భంగా కథనం.

పలాస, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఉద్దానం మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధి కేసులు అధికంగా ఉన్నాయి. మెళియాపుట్టి, టెక్కలి, పాతపట్నం తదితర మండలాల్లో కూడా ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. డయాలసిస్‌ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు డయాలసిస్‌ పొందుతున్నారు. ఇప్పటి వరకూ కిడ్నీ రోగులకు మందులు ఇవ్వడం, అవసరం ఉన్న వారికి డయాలసిస్‌ చేయడం జరుగుతోంది. అయితే, పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం (200 పడకల ఆసుపత్రి)లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయడానికి వైద్యాధికారులు సన్నాహాలు చేస్తోన్నారు. అన్నీ అనుకూలంగా ఉంటే వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించాలని భావిస్తోన్నారు.

- ఉద్దానంలోని ఓ గ్రామానికి చెందిన డి.అమ్ములమ్మ ఆరోగ్యంగా ఉండేది. తన గ్రామంలో పొలం పనులు చేసుకొని కుటుంబంతో హాయిగా జీవించేది. ఉన్నట్లుండి ఆమె కాళ్లపై వాపులు రావడంతో గ్రామంలోని వైద్య సహాయక బృందాలకు చూపించింది. అనుమానంతో పలాస-కాశీబుగ్గలోని కిడ్నీ ఆసుపత్రిలో సీకేడీ పరీక్షలు చేయిస్తే ఆమె కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో డయాలసిస్‌ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సాధారణ స్థితికి చేరుకుంది.

-ఇచ్ఛాపురం మండలానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థికి కిడ్నీ వ్యాధి సోకింది. చిన్నతనంలోనే ఇటువంటి వ్యాధి సోకడంతో ఆ కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయారు. పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఆ బాలుడికి డయాలసిస్‌ చేయించారు. ప్రస్తుతం కిడ్నీ వ్యాధి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నాడు.


సత్ఫలితాలు ఇస్తున్న పరిశోధనలు..

ఉద్దానంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి గల కారకాలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నాయి. జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇండియా ఆధ్వర్యంలో 18 నెలలుగా పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏడు మండలాల్లోని 200 గ్రామాల్లో పరిశోధనలు జరిపారు. మొత్తం 800 మంది నుంచి రక్తపూతలు తీసుకొని వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణుడు డాక్టర్‌ రవిరాజ్‌ ఆధ్వర్యంలో కూడా పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం రూ.6 కోట్ల నిధులు ఇప్పటికే వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. కిడ్నీ బాధితులకు ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, హరిపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం రిమ్స్‌లో ఉచితంగా మందులు ఇస్తున్నారు. అవసరమైన వారికి డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు.


కిడ్నీ మార్పిడికి సన్నాహాలు

ఉద్దానం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి అవసరం ఉన్నట్లు స్థానిక వైద్యాధికారులు గుర్తించారు. ఆమె బంధువుల్లో ఒకరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పలాస కిడ్నీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో సమావేశం నిర్వహించారు. కిడ్నీ బాధితుల కోసమే ఈ ఆస్పత్రిని ప్రత్యేకంగా నిర్మించారని, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసే స్థాయికి ఆస్పత్రి వెళ్లాలని, ప్రయోగాత్మకంగా ఒకటి నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే రెవెన్యూ, పోలీసుల నుంచి బాధిత మహిళ అనుమతులు పొందారు. విశాఖపట్నం, జెమ్స్‌ ఆసుపత్రులకు చెందిన నెఫ్రాలజిస్టులను కూడా సంప్రదించారు. ఈ వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసు కుని ఆ రోగికి కిడ్నీ మార్పిడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.


బాధితులకు అండగా ప్రభుత్వం..

2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్దానం మండలాల్లోని అన్ని సీహెచ్‌సీల్లో డయాలసిస్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ బాధితులకు డయాలసిస్‌ సేవలు, ఉచితంగా మందులు అందిస్తున్నారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెఫ్రోప్లస్‌ అనే ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం జలజీవన్‌మిషన్‌ ద్వారా ఉద్దానం గ్రామాలకు శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10వేల పింఛన్‌తో పాటు ఉచిత బస్సు సౌకర్యం, మందులు, డయాలసిస్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.


పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో

గత మూడేళ్లలో డయాలసిస్‌ సేవల వివరాలు

==================================

సంవత్సరం బాధితుల సంఖ్య

2024 (మే-డిసెంబరు) 1408

2025 18,726

2026(ఇప్పటి వరకు) 3,907

=================================

మొత్తం 24,041

==================================


పరిశోధనలు చేస్తున్నాం..

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై మా సంస్థ ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రజల నుంచి రక్తపూతలు సేకరించి సూక్ష్మ పరిశోధనలు చేస్తున్నాం. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రజల జీవనశైలి, అధిక వేడి, జీడి, మామిడి, కొబ్బరికి అధిక మోతాదులో పురుగుల మందులు వేయడం, సంచి వైద్యుల ప్రభావంతో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. ఇతర కారణాలను కూడా అన్వేషిస్తున్నాం. ప్రభుత్వానికి నివేదిస్తాం. తుది ఫలితాలు తొందరలోనే తెలుస్తాయి. మేము చేస్తున్న ప్రచారాలు, ప్రభుత్వ ప్రకటనలతో చాలామంది ప్రజలు జీవనశైలి మార్చుకుంటున్నారు. సురక్షితమైన నీటిని తాగడం, వ్యాయామం చేయడం, చిన్న అనుమానం వచ్చినా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల వ్యాధులు తగ్గుముఖం పడుతున్నాయి. దీన్ని నిరంతరం కొనసాగిస్తే మంచి ఫలితాలు ఇస్తాయి.

-ఎ.సింహాచలం, ప్రాజెక్టు మేనేజర్‌, జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇండియా


చికిత్స అందిస్తున్నాం

పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం (ఆసుపత్రి)లో కిడ్నీ బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తున్నాం. నెఫ్రోప్లస్‌, ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల్లో ఇప్పటికే వేలాది మంది డయాలసిస్‌ పొందుతున్నారు. ప్రజల జీవన శైలి మారాలి. పోషక విలువల గల ఆహారం, సురక్షిత నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాధి రాకముందే తగిన పరీక్షలు చేసుకోవాలి. చిన్న లక్షణాలు ఉన్నప్పుడు మందులు వినియోగిస్తే వ్యాధిని నయం చేయవచ్చు.

-డాక్టర్‌ ఎం.శ్రీహరిబాబు, సివిల్‌ సర్జన్‌, ఆర్‌ఎంవో, కిడ్నీ డయాలసిస్‌ కేంద్రం, పలాస

Updated Date - Mar 12 , 2026 | 12:00 AM