Share News

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని..

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:14 AM

పులిబంద గ్రామానికి చెందిన సంకిలి అప్పారావు (35) బుధవారం రాత్రి తన ఇంట్లో శ్లాబ్‌ హుక్కుకు చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు.

 భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని..

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

కోటబొమ్మాళి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): పులిబంద గ్రామానికి చెందిన సంకిలి అప్పారావు (35) బుధవారం రాత్రి తన ఇంట్లో శ్లాబ్‌ హుక్కుకు చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలివీ... మద్యానికి బానిసైన అప్పారావు భార్య రాజేశ్వరితో సఖ్యత లేక తరచూ గొడవలు పడుతుండేవాడు. గొడవ పడిన ప్రతిసారీ రాజేశ్వరి తన కన్నవారింటికి పాతపట్నం మండలంలోనని బొడ్డుమారి గ్రామానికి వెళ్లిపోయేది. మూడు నెలల కిందట అప్పారావుతో గొడవ పడిన రాజేశ్వరి తన అమ్మమ్మ ఊరు నీలంపేటకు వెళ్లి ... ఉండిపోయింది. ఈనేపథ్యంలో ఇటీవల అప్పారావు తన భార్య కాపురానికి రాకపోతే మందు తాగి చనిపోతాను అంటూ పురుగుల మందు సీసా పట్టుకొని వీధిలో తిరిగాడు. దీంతో గ్రామస్థులు సర్ది చెప్పి అతని వద్ద పురుగుల మందు తీసుకొన్నారు. బుధవారం రాత్రి ఇంట్లో శ్లాబ్‌ హుక్కుకు చీరతో ఉరి వేసుకొని మృతిచెందాడు. మృతుడి తల్లి కర్రెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ మామిడి నర్సింగరావు తెలిపారు.

అనారోగ్య సమస్యలతో.. వివాహిత బలవన్మరణం

ఎచ్చెర్ల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సమస్యలతో ఓ వివాహిత ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినఘటన ఫరీద్‌పేట పంచాయతీ నవభారత్‌ కాలనీలో (వరం కాలనీ)లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కథనం మేరకు.. నవభారత్‌ కాలనీలో నివాసముంటున్న యతిరాజులు పద్మావతి దేవి (48) ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం తన ఇంట్లోని వంటగదిలో ప్యాన్‌కు ఉరిపోసుకుంది. పద్మావతి దేవి భర్త శ్రీనివాసరావు రణస్థలం మండలంలోని కొచ్చెర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. యథావిధిగా ఆయన బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య వంటింట్లోని ప్యాన్‌కు ఉరిపోసుకుని విగతజీవిగా కనిపించింది. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది పరిశీలించి ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. వీరికి 2005లో వివాహం కాగా, సంతానం లేరు. పద్మావతి దేవి సోదరుడు బుడుమూరు ప్రభాకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 02 , 2026 | 12:14 AM