Share News

ముచ్చటైన ముగ్గులు

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:20 AM

శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ మైదానంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి.

 ముచ్చటైన ముగ్గులు
ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులు

  • సందడిగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముగ్గుల పోటీలు

  • ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, విద్యార్థినులు

  • ఉట్టిపడిన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు

  • విజేతలకు బహుమతులు, చీరల పంపిణీ

  • ముందుగానే సంక్రాంతి వచ్చింది: ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ మైదానంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందజేయాలని, వాటిని పరిరక్షించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీలకు ఈ సంవత్సరం కూడా జిల్లా నలుమూలల నుంచి ఉత్సాహవంతులైన మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముగ్గులను వేశారు. ఈ ఏడాది సంతూర్‌, సన్‌ఫీస్ట్‌ మ్యాజిక్‌ మామ్స్‌ బిస్కెట్స్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ మందిర్‌ భారత్‌వాసి అగర్‌బత్తీ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా స్పాన్సర్లగా వ్యవహరించగా, జిల్లాలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు శ్రీకాకుళం నగరంలోని మీనాక్షి హాస్పిటల్‌ వైద్యులు డా.గొండు గంగాధరరావు(సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌), డా.సీహెచ్‌.సరిత(గైనకాలజిస్టు) స్పాన్సరర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతీశంకర్‌, ‘ఆంధ్రజ్యోతి’ ఎడిషన్‌ ఇన్‌చార్జి బయపరెడ్డి, స్టాఫ్‌ రిపోర్టర్‌ టి.సురేష్‌బాబు, ఏబీఎన్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ రమేష్‌, టీడీపీ మహిళా నాయకురాలు కవ్వాడి సుశీల, టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు పిరియా మాధవి, ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్లు, సిబ్బంది ఎల్‌వీ.రమణ, గోపి, ధనుంజయ, బాలాజీ, అనంతరామన్‌, జోగారావు, రమేష్‌, కృష్ణమూర్తి, విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

విజేతగా భవాని..

అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ రజని, ఇతర న్యాయనిర్ణేతలతో కలిసి ముగ్గులను పరిశీలించి విజేతలను నిర్ణయించారు. ఎన్‌.భవాని(పలాస) ప్రథమ బహుమతి, పత్తి జ్యోతి(పలాస) ద్వితీయ బహుమతి, కూర్మాపు ఆదిలక్ష్మి (శ్రీకాకుళం) తృతీయ బహుమతి గెలుచుకున్నారు. వీరికి ఎమ్మెల్యే గొండు శంకర్‌ బహుమతులను అందజేశారు. కె.ఆదిలక్ష్మి(శ్రీకాకుళం), కె.కుమారి(శ్రీకాకుళం), ఎల్‌.జనని(శ్రీకాకుళం), వీకే జ్యోతి(శ్రీకాకుళం), ఆర్‌.ఆశాజ్యోతి(శ్రీకాకుళం), ఎన్‌.జ్యోతి(పలాస)కు కన్సొలేషన్‌ బహుమతులను అందజేశారు. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ చీరలను అందించారు. ఈ పోటీల్లో ప్రథమ విజేతగా నిలిచిన భవానిని ఈ నెల 10న విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు.


‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ కృషి అభినందనీయం: ఎమ్మెల్యే శంకర్‌

BJR_4247.gif ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థినులు ఎక్కువగా పాల్గొనడం ఆనందదాయకమని, మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు వారంతా కృషి చేయాలని కోరారు. ఇక్కడ వేసిన ముగ్గులు, వారి ఉత్సాహం, సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందుగానే నగరానికి వచ్చేసినట్లు ఉందని పేర్కొన్నారు. ఘనమైన మన వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అందుకే ప్రతీ ఏడాది ఈ కార్యక్రమానికి తప్పక సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఇక ముందు కూడా తన వంతు సహాయం అందిస్తానని అన్నారు.

భాగస్వాములు కావడం ఆనందదాయకం: డాక్టర్‌ గొండు గంగాధరరావు దంపతులు

ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న మీనాక్షి హాస్పిటల్‌ వైద్యులు గొండు గంగాధరరావు, హరిత దంపతులు మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే ప్రతి ఇంటి లోగిళ్లలో రంగురంగుల ముగ్గులు, హరిదాసుల పాటలు, భోగీ మంటలు, ధాన్యపు రాశులు, పాడి పంటలు అని పేర్కొన్నారు. నేటి ఈ ముగ్గుల పోటీల్లో వీటన్నింటినీ కళ్లముందు ఆవిష్కరించారని అన్నారు. ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. మన సంప్రదాయాన్ని ఇలా కొనసాగించేందుకు తమ వంతు సహాయం అందించగలడం, ఇంత చక్కని కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’కు కృతజ్ఞతలు అని అన్నారు.


ఎంతో ఆనందంగా ఉంది

పలాస నుంచి ఉదయాన్నే శ్రీకాకుళం చేరుకున్నా. ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అంటే నాకు చాలా ఇష్టం. గతేడాది కూడా శ్రీకాకుళంలో నిర్వహించిన పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకున్నా. ఈ దపా ప్రథమ బహుమతి గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తా.

-ఎన్‌.భవాని, ప్రథమ విజేత, పలాస

ప్రతి ఏడాదీ పాల్గొంటా..

జిల్లాలో ప్రతి ఏడాదీ జరిగే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముగ్గుల పోటీల్లో నేను తప్పకుండా పాల్గొంటాను. గతేడాది నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాను. అదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా పాల్గొని ద్వితీయ బహుమతి పొందాను. వచ్చే ఏడాది కూడా పాల్గొని ప్రథమ బహుమతి సాధించేందుకు కృషి చేస్తా. చిన్నతనం నుంచి ముగ్గులు వేయడమంటే మహా సరదా. సంక్రాంతి పండుగ శోభ మన ఇంటి ముంగిట్లో వేసే ముగ్గుల్లోనే ఉంటుంది.

పత్తి జ్యోతి, ద్వితీయ విజేత, పలాస

ముగ్గులంటే ప్రాణం

నాకు ముగ్గులంటే చిన్నతనం నుంచీ ప్రాణం. మావారు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైరయ్యారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఎంతో ప్రోత్సహిస్తుంటారు. మన సంప్రదాయాలను భావి తరాలకు అందజేయడం మనందరి బాధ్యత. గతంలో జరిగిన పోటీల్లో పాల్గొని ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నా. ఈ తరం అమ్మాయిలకు ముగ్గులు వేయడంపై ఆసక్తి కల్పించేందుకు ఎప్పుడూ ముందుంటాను. నాకు ఓపిక ఉన్నంతవరకు ఈ పోటీల్లో పాల్గొంటాను. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’కు నా అభినందనలు.

-కూర్మాపు ఆదిలక్ష్మి, తృతీయ విజేత, శ్రీకాకుళం

BJR_4034.gif

పోటీలో పాల్గొనేందుకు వస్తున్న విద్యార్థినులు

Updated Date - Jan 04 , 2026 | 12:20 AM