పిడిగుద్దులతో చంపేసి..
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:34 PM
కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.
ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త
పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలిన వైనం
పోలీసుల దర్యాప్తు.. నేరాన్ని అంగీకరించిన నిందితుడు
రణస్థలం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. పోస్టుమార్టం నివేదికలో మాత్రం హత్యగా తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఎస్‌ఐ వి.సత్య నారాయణ వివరాల మేరకు.. మండలంలోని సరగడపేట గ్రామానికి చెం దిన కె.మహాలక్ష్మి (40) అనే మహిళకు భర్త పోతయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహాలక్ష్మి గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తోంది. ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటి వద్ద అపస్మారక స్థితిలో పడిఉంది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కొండములగాం సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం నివేదికలో ఆమె హత్యకు గురైనట్లు బయటపడింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా మహాలక్ష్మిని తానే చంపినట్లు భర్త పోతయ్య అంగీకరించాడు. తమ మధ్య కలహాల నేపథ్యంలో పిడుగుద్దులతో మహా లక్ష్మిని చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోతయ్యను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.