ఉద్దానంలో ఎలుగుల అలజడి
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:58 PM
A bear trapped in an iron fence ఉద్దానంలో మళ్లీ ఎలుగుబంట్ల అలజడి మొదలైంది. బాతుపురం, చీపురుపల్లి, మోట్టూరు, అక్కుపల్లి, రాజాం తదితర గ్రామాల్లోని జీడి, మామిడి, పనస తోటల్లో ఎలుగులు సంచరిస్తుండడంతో ఆయా ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా శనివారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లి గ్రామ సమీప తోటల్లోని ఇనుప కంచెలో ఓ ఎలుగుబంటి చిక్కుకుంది.
అనకాపల్లి తోటల్లో సంచారం
ఇనుప కంచెలో చిక్కుకున్న ఎలుగుబంటి
రెస్క్యూటీం సహాయంతో బంధించి ‘జూ’కు తరలింపు
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో మళ్లీ ఎలుగుబంట్ల అలజడి మొదలైంది. బాతుపురం, చీపురుపల్లి, మోట్టూరు, అక్కుపల్లి, రాజాం తదితర గ్రామాల్లోని జీడి, మామిడి, పనస తోటల్లో ఎలుగులు సంచరిస్తుండడంతో ఆయా ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా శనివారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లి గ్రామ సమీప తోటల్లోని ఇనుప కంచెలో ఓ ఎలుగుబంటి చిక్కుకుంది. నడుముకు ఇనుప వైరు బిగిసుకోవడంతో ఎలుగుబంటి బయటకు రాలేకపోయింది. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎఫ్‌వో నాగేంద్ర, పలాస రేంజర్ కె.నాయుడు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటి దుస్థితిని పరిశీలించారు. ఎలుగుబంటి బీకర అరుపులు విని.. ఆ సమయంలో ఎవరైనా దగ్గరికి వెళితే దాడి చేస్తుందని భావించారు. దీంతో విశాఖ జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ప్రత్యేక వాహనంలో వచ్చి.. ఇనుపకంచెలో చిక్కుకున్న ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చి జాగ్రత్తగా బోన్‌లో బంధించారు. ఆ ఎలుగుబంటిని విశాఖ జూ కు తరలించారు.
గత అనుభవాల దృష్ట్యా..
2024 మర్చి 23న అనకాపల్లి గ్రామానికి చెందిన చీడిపల్లి లోకనాథం, అప్పికొండ కూర్మారావు ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందారు. లోకనాఽథం భార్య సావిత్రితోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో అనకాపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామస్థులు ఎలుగుబంట్లు, అడవిపందులు రాకుండా తోటల్లో చుట్టూ ఇనుక కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామాల్లో ఇటీవల ఎలుగుబంట్లు బెడద తగ్గిందని ఈ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. కాగా శనివారం రాత్రి గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఎలుగుబంటి ఇనుప కంచెలో చిక్కుకుపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ప్రస్తుతం మొత్తం మూడు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని వెల్లడించారు. వాటి నుంచి రక్షణ కల్పించేలా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.