Share News

కరెంట్‌తో జాగ్రత్త

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:37 PM

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ విద్యుత్‌ ఉపకరణాలను వినియోగిస్తున్నాం.

కరెంట్‌తో జాగ్రత్త
పొలంలోనే మృతి చెందిన మోహనరావు

- జిల్లాలో వరుస ప్రమాదాలు

- ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

- ప్రతి ఏడాది 30 మంది వరకు మత్యువాత

- ప్రమాదకరంగా విద్యుత్‌ లైన్లు

- పట్టించుకోని అధికారులు

- ఈ ఏడాది మే 27న టెక్కలి పెద్దబ్రాహ్మణ వీధికి చెందిన ధూపాన కామేశ్వరరావు రెడ్డి (65) విద్యుత్‌ షాక్‌కు గురై కుప్పకూలాడు. తన ఇంట్లోని దేవుడి గదిలో సీరియల్‌ లైట్లు అమర్చుతున్న క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యా డు. కుటుంబ సభ్యులు ఆయన్ను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

- ఈ ఏడాది జూన్‌ 24న మెళియాపుట్టి మండలం దుర్భలాపురం గ్రామానికి చెందిన పెద్దింటి మోహనరావు అనే కౌలు రైతు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. సారికంద పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన మోహనరావు పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంం కారణంగా మోహనరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపించారు.

-గత నెల 16న టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ చల్లపేట గ్రామానికి చెందిన గురుజు ఈశ్వరరావు(19) అనే యువకుడు బహిర్భూమికి వెళుతూ విద్యుత్‌ వైర్లపై కాలు వేయడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. గ్రామంలో రోడ్డు పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన మోటార్‌ తీగలను నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈ ప్రమాదం జరిగింది.

టెక్కలి రూరల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ విద్యుత్‌ ఉపకరణాలను వినియోగిస్తున్నాం. కనీసం జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. తరచూ చోటుచేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. వానాకాలంలో ఇళ్లలో విద్యుత్‌ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇనుప తీగలపై దుస్తులు ఆరవేయడం, వాటర్‌ హీటర్‌, గీజర్లు, మొబైల్‌ చార్జర్లు, ఇళ్లలో నీటి పంపు సెట్లు, పొలాల్లో వ్యవసాయ మోటార్ల వినియోగంలో కనీస జాగ్రత్తలో పాటించకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటిపై అవగాహన కల్పించాల్సిన విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. చాలాచోట్ల పొలాల్లో విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతున్నా సరిచేయడం లేదు. దీంతో పొలాలకు వెళ్తున్న రైతులకు తీగలు తగలడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని లైన్లకు విద్యుత్‌ కట్‌ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో తొలగింపులు చేపట్టకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో అధికంగా విద్యుత్‌ ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది 25 మంది నుంచి 30 మంది వరకు మృతి చెందుతున్నారు. పశువులు, జంతువులు 100 వరకు మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. విద్యుత్‌ లైన్ల మరమ్మతులకు అధిక నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. తీగలను సరిచేయకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది లైన్‌మెన్‌లు స్తంభాలను సైతం ఎక్కలేకపోతున్నారు. సహాయకులను ఏర్పాటు చేసుకుని పని కానిచ్చేస్తున్నారు. దీంతో విద్యుత్‌ మరమ్మతులు సక్రమంగా జరగడం లేదు.

జాగ్రత్తలు తీసుకోవాలి..

చాలామంది తడి చేతులతో స్విచ్‌లను వేస్తుంటారు. సాకెట్లలో ప్లగ్గులు పెట్టడం, తీయటం చేస్తుంటారు. దీనివల్ల చేతిలోని నీటి తేమ స్విచ్‌లు, సాకెట్లలోకి వెళ్లి విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నాయి. వైర్లు జాయింట్‌ ఉంటే సరిచేసుకోవాలి. మోటార్‌ పంపుసెట్‌ పనిచేయకపోతే నిపుణులతో మరమ్మతులు చేయించాలి. విద్యుత్‌ స్తంభం నుంచి ఇంట్లోకి వచ్చే సర్వీసు వైరు, వైరింగ్‌, స్విచ్‌ బోర్డులను ఎప్పటికికప్పుడు పరిశీలించాలి.

అవగాహన కల్పిస్తున్నాం

విద్యుత్‌ ప్రమాదాలపై సదస్సులు ఏర్పాటు చేసి వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్‌ మరమ్మతుల గురించి తెలియకపోతే వాటి జోలికి వెళ్లవద్దు. పొలాల్లో తీగలు వేలాడుతున్నట్లు మాకు తెలియజేస్తే సరిచేస్తాం. విద్యుత్‌ వాడకంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉంటే మంచిది. అధికంగా వర్షా కాలంలో అప్రమత్తంగా ఉండాలి.

-దాసరి మురళీకృష్ట, విద్యుత్‌శాఖ ఏఈ టెక్కలి

Updated Date - Aug 09 , 2026 | 11:37 PM