Share News

రక్తపోటుతో జాగ్రత్త

ABN , Publish Date - May 17 , 2026 | 12:18 AM

World Hypertension Day ఒత్తిడితో కూడిన జీవన శైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలతో నేడు రక్తపోటు బాధితులు అధికమవుతున్నారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు యువతను కూడా పట్టి పీడిస్తోంది. రక్తపోటు కారణంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రక్తపోటుతో జాగ్రత్త

  • జిల్లాలో 1.45 లక్షల మంది బాధితులు

  • యువతలో పెరుగుతున్న హైబీపీ

  • జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణం

  • చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్న వైనం

  • నేడు వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే

  • అరసవల్లి, మే 16(ఆంధ్రజ్యోతి): ఒత్తిడితో కూడిన జీవన శైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలతో నేడు రక్తపోటు బాధితులు అధికమవుతున్నారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు యువతను కూడా పట్టి పీడిస్తోంది. రక్తపోటు కారణంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ‘నిశ్శబ్ద కిల్లర్‌’గా పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీపీ బాధితులు పెరుగుతున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 140/90 సాధారణ బీపీగా పరిగణిస్తోంది. ప్రతీ కుటుంబంలో ఒకరైనా సరే రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ముందుగా గుర్తిస్తే ఎటువంటి ప్రాణాపాయం ఉండదని, చికిత్స ద్వారా పూర్తిగా బీపీని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఆదివారం వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే (అధిక రక్తపోటు దినం) సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

  • ఉప్పుతోనే ముప్పు....

  • జిల్లాలో సుమారు 1.45 లక్షల మంది బీపీ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో పురుషులు 78వేల మంది, మహిళలు 67వేల మంది ఉన్నారు. ఇందులో 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారు 41వేల మంది బాధితులు ఉండడం గమనార్హం. అధికంగా ఉప్పు వినియోగం వల్ల బీపీ సమస్యకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చాలామంది రోజుకు 10 గ్రాములకుపైగా ఉప్పు తీసుకుంటున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఉప్పు అధికంగా వినియోగించడంతో రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి బీపీ తీవ్రత అధికమవుతుంది. బీపీ సమస్యతో బాధపడుతున్న వారిలో చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఎప్పుడైనా ఒకసారి తల తిరుగుతున్నట్లు అనిపించినా సరే మళ్లీ పూర్వస్థితికి వచ్చేస్తారు. ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడం వలన అధికశాతం ప్రజల్లో హఠాత్తుగా గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌ వంటి కేసులు నమోదవుతున్నాయి. నిజానికి 55శాతం గుండెపోటు కేసులకు అధిక రక్తపోటు మాత్రమే కారణం. చాలామంది గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చిన తరువాతే తమకు బీపీ ఉందని తెలుసుకుంటున్నారు.

  • ప్రభుత్వాసుపత్రుల్లో 82 వేలమంది చికిత్స

  • జిల్లాలోని శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పలాస, టెక్కలి, సోంపేట ప్రాంతాల్లో అధికంగా బీపీ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య సర్వేల్లో గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకున్న ప్రతీ 10 మందిలో ముగ్గురికి రక్తపోటు లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుమారు 82వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇటీవల యువతలో బీపీ కేసులు పెరుగుతున్నాయి. రాత్రివేళల్లో పనిచేయడం, మొబైల్‌ అధిక వినియోగం, ఒత్తిడి, ఫాస్ట్‌ ఫుడ్‌ వినియోగం, మద్యం వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం, అధికంగా టీ, కాఫీ, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వంటి కారణాలతో అధికంగా బీపీ బారిన పడుతున్నారు.

  • నివారణ చర్యలు

  • రోజుకు కనీసం అర గంట నడవాలి.

  • ఉప్పు తగ్గించాలి.

  • మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

  • క్రమం తప్పకుండా బీపీ చెకప్‌ చేయించుకోవాలి.

  • బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

  • పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

  • సరిపడా నిద్ర ఉండాలి.

  • యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి.

  • మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • పరీక్షలు చేయించుకోవాలి

  • ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమం తప్పకుండా బీపీ చెకప్‌ చేయించుకోవాలి. బీపీలో హెచ్చు తగ్గులు గమనిస్తే వైద్యుని సూచనలతో ఈసీజీ, ఈఈజీ, 5డీ ఎకో, అవసరమైతే టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఆరునెలలకోసారి అందరూ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాయామం, యోగా, ధ్యానం, సమతులాహారం తీసుకోవడం వంటి చర్యల ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

  • - డాక్టర్‌ విజయకుమార్‌, కార్డియాలజిస్టు, శ్రీకాకుళం

Updated Date - May 17 , 2026 | 12:18 AM