Share News

స్థానిక పోరులో బీసీలకు పెద్దపీట

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:22 AM

Greater representation in reservations! స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు(బీసీ) కేటాయించాల్సిన సీట్ల రిజర్వేషన్లపై ‘బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌’ కీలక గణాంకాలను వెల్లడించింది. 2021 ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది స్థానిక పోరు కోసం రూపొందించిన ఈ నివేదికలో జిల్లాలో బీసీల ప్రాతినిథ్యం గణనీయంగా పెరగడం విశేషం. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు మొదలుకుని జడ్పీటీసీలు, మునిసిపల్‌ వార్డుల వరకు దాదాపు అన్ని స్థాయిల్లోనూ బీసీలకు కేటాయించిన సీట్ల సంఖ్య, రిజర్వేషన్‌ శాతం పెరిగింది.

స్థానిక పోరులో బీసీలకు పెద్దపీట

  • రిజర్వేషన్‌లో మరింత ప్రాతినిథ్యం!

  • సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్‌ స్థానాల్లో పెరిగిన కోటా

  • బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ ముసాయిదా నివేదిక వెల్లడి

  • శ్రీకాకుళం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు(బీసీ) కేటాయించాల్సిన సీట్ల రిజర్వేషన్లపై ‘బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌’ కీలక గణాంకాలను వెల్లడించింది. 2021 ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది స్థానిక పోరు కోసం రూపొందించిన ఈ నివేదికలో జిల్లాలో బీసీల ప్రాతినిథ్యం గణనీయంగా పెరగడం విశేషం. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు మొదలుకుని జడ్పీటీసీలు, మునిసిపల్‌ వార్డుల వరకు దాదాపు అన్ని స్థాయిల్లోనూ బీసీలకు కేటాయించిన సీట్ల సంఖ్య, రిజర్వేషన్‌ శాతం పెరిగింది.

  • జిల్లాలో మొత్తం 912 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 327 సర్పంచ్‌ స్థానాలను (35.86 శాతం) బీసీలకు కేటాయించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. 2021లో జిల్లాలో 896 పంచాయతీలు ఉంటే 317 స్థానాలు (35.38 శాతం) మాత్రమే బీసీలకు రిజర్వ్‌ అయ్యాయి. గతంతో పోలిస్తే స్థానాల సంఖ్యతోపాటు శాతం కూడా పెరిగింది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల విషయానికొస్తే.. జిల్లాలో మొత్తం 8,654 వార్డులకుగాను 3,163 వార్డులను బీసీలకు ప్రతిపాదించారు.

  • ఎంపీటీసీ, జడ్పీటీసీల్లోనూ..

  • మండల, జిల్లాపరిషత్‌ స్థాయిలోనూ బీసీలకు కేటాయింపులు మెరుగయ్యాయి. జిల్లాలో మొత్తం 665 ఎంపీటీసీ సెగ్మెంట్లకుగాను 230 స్థానాలు (34.59 శాతం) బీసీలకు దక్కనున్నాయి. 2021లో 667 ఎంపీటీసీలు ఉండగా 226 స్థానాలు (33.88 శాతం) మాత్రమే బీసీలకు రిజర్వ్‌ అయ్యాయి. అలాగే జిల్లాలో 38 జడ్పీటీసీ స్థానాలకు గాను 13 స్థానాలను (34.21 శాతం) బీసీలకు సిఫార్సు చేయగా, 2021లో ఇది 12 స్థానాలకు (31.58 శాతం) పరిమితమైంది.

  • మున్సిపాలిటీల్లో..

  • పట్టణ స్థానిక సంస్థల్లో(యూఎల్‌బీ) వార్డు మెంబర్ల రిజర్వేషన్లలో భారీగా మార్పు కనిపించింది. జిల్లాలో 131 పట్టణ వార్డులు ఉండగా, 53 వార్డులను(40.46 శాతం) బీసీలకు కేటాయించారు. 2021లో 54 వార్డులు ఉండగా అందులో 18 స్థానాలు (33.33శాతం) బీసీలకు దక్కాయి. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో బీసీల ప్రాతినిథ్యం అత్యధికంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2021తో పోలిస్తే రిజర్వేషన్ల గణాంకాల్లో మార్పులు రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయని కమిషన్‌ తన ముసాయిదాలో పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్‌ లేదా చట్టపరమైన సమస్యల వల్ల 2021లో కొన్ని స్థానాలకు ఎన్నికలు జరగకపోవడం, గ్రామాలు, వార్డుల విలీనాలకు సంబంధించిన అంశాలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. అలాగే 2011 జనాభా లెక్కలు, ఈ ఏడాది స్మార్ట్‌ పల్స్‌ సర్వే(ఎస్‌జీఎస్‌డబ్ల్యు) డేటా మధ్య ఎస్సీ, ఎస్టీ జనాభా నివృత్తి పెరగడం వల్ల కూడా సీట్ల కేటాయింపుల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది.

Updated Date - Aug 16 , 2026 | 12:22 AM