మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు విడిచి
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:12 AM
సుమారు 34 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి చివరకు ప్రాణాలు విడిచింది.
- చికిత్స పొందుతూ చిన్నారి గాయత్రి మృతి
- చిలకపాలెంలో విషాదం
ఎచ్చెర్ల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): సుమారు 34 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి చివరకు ప్రాణాలు విడిచింది. చిలకపాలెం గ్రామానికి చెందిన తోనంగి మీనా మంగళవారం వేకువజామున తన ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, ఆపై తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదే రోజు మీనాతో పాటు ఆమె 8 నెలల కుమారుడు మృతి చెందగా, బుధవారం రెండేళ్ల కుమార్తె గాయత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్ర మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న మీనా మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో పిల్లలకు ముందుగా పాలలో గడ్డి మందు కలిపి తాగించింది. ఆ తర్వాత ఆమె కూడా తాగింది. ఇది గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు వారిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజున మీనాతో పాటు ఆమె కుమారుడు కులదీప్ మృతిచెందారు. కుమార్తె గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మృతిచెందింది. మంగళవారం మృతిచెందిన మీనా, కులదీప్‌ల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాయత్రి మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు ఎస్‌ఐ జ.లక్ష్మణరావు తెలిపారు. ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి కూడా కన్నుమూయడంతో చిలకపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.