Share News

నేడు బ్యాంకులు బంద్‌

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:06 AM

Bank employees gear up for a strike యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో అన్ని బ్యాంకులు బంద్‌ చేయనున్నాయి. సమస్యల పరిష్కారం కోరుతూ.. బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెబాటకు సన్నద్ధమవుతున్నారు.

నేడు బ్యాంకులు బంద్‌
టెక్కలిలో డీసీసీ బ్యాంక్‌

సమ్మెబాటకు ఉద్యోగులు సన్నద్ధం

పాత శ్రీకాకుళం/ టెక్కలి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో అన్ని బ్యాంకులు బంద్‌ చేయనున్నాయి. సమస్యల పరిష్కారం కోరుతూ.. బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెబాటకు సన్నద్ధమవుతున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు సూర్యమహల్‌ నుంచి దీపామహల్‌ వరకూ బ్యాంకర్లు ర్యాలీ నిర్వహించి.. ధర్నా చేయనున్నారు. జిల్లా బ్యాంక్‌ ఉద్యోగుల సమన్వయకమిటీ సంఘం అధ్యక్షుడు గిరిధర్‌ నాయక్‌, కార్యదర్శి బి.శ్రీనివాసులు, మహిళా కన్వీనర్‌ జి.కరుణ, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. స్టేట్‌బ్యాంకు ప్రధాన శాఖ ముందు అన్ని బ్యాంకుల ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ కన్వీనర్‌ కె.సి.హెచ్‌ వెంకట రమణ, నాయకులు పొన్నాడ .కిషోర్‌ కుమార్‌, మండా శ్రీనివాసరావు తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ పంజాబ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, డీసీసీబీ, కోటక్‌ మహేంద్ర బ్యాంక్‌, కరూర్‌ వైశ్య బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఎస్‌బీఐ, గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకులు సమ్మె చేయనున్నట్టు వెల్లడించారు.

డిమాండ్లు ఇవీ..

గతంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఒప్పుకున్న విధంగా వారానికి ఐదు రోజులు పనిదినాలు కల్పించాలి. క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌, పాత పెన్షన్‌ విధానం పక్కాగా అమలు చేయాలి. ఐటీ నుంచి నాలుగుశాతం మినహాయింపు కావాలి. పదవీవిరమణ పొందిన బ్యాంకు ఉద్యోగుల మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం బ్యాంకులే భరించాలి. గ్రాట్యూటీ సీలింగ్‌ పెంచాలి. పింఛన్‌ అప్‌డేషన్‌, బ్యాంకుల్లో అన్నిరకాల పోస్టుల ఖాళీలు భర్తీ చేయాలి. ప్రైవేట్‌ బ్యాంకులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఇలా తదితర డిమాండ్లతో శుక్రవారం సమ్మెకు పిలుపునిచ్చారు. దీనికి పరిష్కారం లభించకపోతే ఈనెల 28 నుంచి 30 వరకు మరోసారి సమ్మె చేయనున్నారు. అప్పటికీ డిమాండ్లు నెరవేరకపోతే.. అక్టోబరు 26 నుంచి బ్యాంకర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

ఆల్‌ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫిడిరేషన్‌, నేషనల్‌ కాన్ఫిడిరేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాంగ్రెస్‌, ఇండియన్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌కు సంబంధించిన బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనున్నారు.

ఇదిలా ఉండగా శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా వినియోగదారులకు సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయకచవితి సందర్భంగా వరుస మూడురోజులపాటు బ్యాంకులకు సెలవులు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Updated Date - Sep 11 , 2026 | 12:06 AM