నేడు బ్యాంకర్ల సమ్మె
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:14 AM
Bankers' strike బ్యాంకర్లు సమ్మెబాటకు సన్నద్ధమవుతున్నారు. నెలలో ప్రతి శనివారం సెలవు అమలు చేయాలని కోరుతూ జిల్లాలోని 340 అన్నిరకాల బ్యాంకు శాఖలు మంగళవారం సమ్మె చేయనున్నాయి.
- ప్రతి శనివారం సెలవు అమలు చేయాలని డిమాండ్
టెక్కలి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): బ్యాంకర్లు సమ్మెబాటకు సన్నద్ధమవుతున్నారు. నెలలో ప్రతి శనివారం సెలవు అమలు చేయాలని కోరుతూ జిల్లాలోని 340 అన్నిరకాల బ్యాంకు శాఖలు మంగళవారం సమ్మె చేయనున్నాయి. నాలుగేళ్ల కిందట పే-రివిజన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్‌తో ప్రతి శనివారం సెలవు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ రెండు, నాలుగు శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవు అమలవుతోంది. ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, డీఎస్‌ఎస్ వంటి ఫైనాన్స్ సంస్థలకు మాత్రం ప్రతి శనివారం సెలవు అమలులో ఉంది. దీంతో తమకు కూడా ప్రతి శనివారం సెలవు కావాలని కోరుతూ యునైటెడ్ ఫర్ పోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో సుమారు 1,500 మంది బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో పాల్గొనున్నారు. సమ్మె కారణంగా జిల్లాలో రోజుకి సుమారు రూ.740కోట్ల బ్యాంకు లావాదేవీలకు బ్రేక్ పడనుంది. కాగా ఇప్పటికే శని, ఆదివారాలతోపాటు రిపబ్లిక్‌డే కారణంగా వరుసగా మూడురోజుల బ్యాంకులు సెలవు కావడంతో ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. మంగళవారం కూడా బ్యాంకర్ల సమ్మెతో సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయమై లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా మంగళవారం జిల్లాలో 340 వరకు అన్నిరకాల బ్యాంకుల సిబ్బంది సమ్మెలో పాల్గొనున్నారని తెలిపారు. నెలలో ప్రతి శనివారం సెలవు దినం ప్రకటించాలన్నదే వారి ప్రధాన డిమాండ్ అన్నారు.